వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మరోసారి ఢిల్లీలో విమర్శలకు దిగారు. విమర్శలు అంటూ ఏపీ హక్కుల్ని కాలరాస్తున్న భాజపాపైనో, ఆర్డర్ లేదన్న పేరుతో సభను అడ్డగోలుగా వాయిదా వేస్తున్న సర్కారు తీరుపైనో కాదు! ఢిల్లీలో కూర్చుని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపైనే ఆయన విమర్శలు చేస్తున్నారు. విమర్శలు చెయ్యొద్దని ఎవ్వరూ అనరు. కానీ, విజయసాయి ఢిల్లీకి వెళ్లింది ఈ పనికోసమేనా అన్నట్టుగా ఉంది మరి. చంద్రబాబు నాయుడుపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇవ్వాలని నిర్ణయించినట్టు విజయసాయి రెడ్డి చెప్పారు. దేశ ప్రధానమంత్రిని సీఎం చంద్రబాబు తప్పు పడుతున్నారు అన్నారు.
ఒక పార్లమెంటు సభ్యుడిగా దేశ ప్రధానిని కలుసుకునే హక్కు తనకు ఉందని విజయసాయి రెడ్డి చెప్పారు. ప్రజల సమస్యల్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లడం కోసం కలుస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న అవినీతిని కూడా ప్రధాని దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధిగా తనపై ఉందని స్పష్టం చేశారు. దేశాన్ని పాలించే ప్రధానమంత్రిపైనే ఆరోపణలు చేస్తూ, అత్యంత విలువైనా గౌరవం కలిగిన ప్రధానమంత్రి కార్యాలయంపై చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారన్నారు. స్వయంగా భారత ప్రధానిని, పార్లమెంటుని ఆయన తప్పుబడుతున్నారు. కాబట్టి, ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇవ్వాలని నిర్ణయించామనీ, త్వరలోనే నోటీసులు ఇస్తామని విజయసాయి మీడియాతో చెప్పారు.
రెండ్రోజుల కిందట కూడా విజయసాయి ఇలానే మాట్లాడారు. చంద్రబాబును బోనులో నిలబెట్టే వరకూ తాను ప్రయత్నిస్తూనే ఉంటానని పార్లమెంటు ప్రాంగణంలో చెప్పారు. మొత్తానికి, విజయసాయి ఫోకస్ అంతా కేవలం చంద్రబాబు నాయుడుపైనే ఉంది. అంతేగానీ… ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలపైనా, కేంద్రం అణచివేతకు గురౌతున్న ఏపీ హక్కుల సాధనపైనా వారి చిత్తుశుద్ధి కనిపించడం లేదు. ఓపక్క అవిశ్వాస తీర్మానాన్ని సభలోని రానీయకుండా భాజపా ఎత్తులు వేస్తుంటే వాటి గురించి విజయసాయి మాట్లాడరు..! అన్నాడీఎంకే, తెరాస ఎంపీలు సభా కార్యక్రమాలకు అడ్డుపడుతూ ఉంటే… ఆ విషయం చర్చించి, సభను ఆర్డర్ లో ఉంచాలనే అంశంపై తాను ప్రయత్నిస్తున్నానని మాట చెప్పినా బాగుండేది. ఆ జోలికే వెళ్లడం లేదు. చంద్రబాబు.. అవినీతి.. చర్యలు.. ఇప్పుడు సభా హక్కుల నోటీసులు..! ఇవ్వొద్దనీ ఎవ్వరూ ఖండించరు, ప్రధానిని కలవొద్దనీ ఎవ్వరూ విమర్శించరు. కాకపోతే, దాని కంటే ముందుగా రాష్ట్ర ప్రయోజనాల అంశమై కూడా మాట్లాడుతుంటే కాస్త బాగుంటుంది.