తెలుగుదేశం పార్టీకి అమ్ముడుబోయి… వైసీపీపై విమర్శలు చేస్తున్నారంటూ.. కన్నా లక్ష్మినారాయణపై గతంలో విజయసాయిరెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అప్పుడు రేగిన రాజకీయ దుమారం .. తర్వాత ఢిల్లీ పెద్దలు కలుగ జేసుకోవడంతో సద్దుమణిగిందని అందరూ అనుకున్నారు. అసలు ఈ వివాదం రేగడానికి కారణంగా… కరోనా ర్యాపిడ్ టెస్ట్ కిట్లలో అవినీతిపై కన్నా చేసిన ఆరోపణలు. ఇప్పుడు కన్నా లక్ష్మినారాయణ అంత కంటే పెద్ద స్కాం అంటూ… 108 వాహనాల కాంట్రాక్ట్ అంశాన్ని తెరపైకి తీసుకు వచ్చారు. ఐదేళ్ల కాలంలో దాదాపుగా రూ. వెయ్యి కోట్ల ప్రజాధనాన్ని విజయసాయిరెడ్డి అల్లుడు స్వాహా చేసేలా ఉత్తర్వులు ఇచ్చారని.. దీని వెనుక గూడుపుఠాణి ఏమిటో బయట పెట్టాలని.. కన్నా డిమాండ్ చేస్తున్నారు.
అసలు విషయం ఏమింటే.. ఏపీలో 108 అంబులెన్స్ సేవలు ఇప్పటికే నడుస్తున్నాయి. గత ప్రభుత్వం 2018లో బీఏజీ అనే సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఒక్క అంబులెన్స్ నిర్వహణకు నెలకు లక్షా ముఫ్పై ఒక్క వేలు చెల్లించాలనేది ఒప్పందం. ఈ ఒప్పందం ఐదేళ్ల పాటు ఉంటుంది. ప్రభుత్వం రాగానే…బీఏజీ సంస్థతో ఏపీ సర్కార్ ఒప్పందం రద్దు చేసేసింది. వెంటనే… అరబిందో ఫార్మా ఫౌండేషన్‌కు ఇచ్చేసింది. సరే రివర్స్ టెండరింగ్ లో ఆదా చేస్తున్నారేమో అని అనుకున్నారు. కానీ… అరబిందో ఫార్మా ఫౌండేషన్‌కు నెలకు.. 2.21 లక్షలు చెల్లిస్తామని అంగీకరించారు. కొత్తగా కొనుగోలు చేసే వాటికి 1.78 లక్షలు చెల్లిస్తామని ఒప్పందం చేసుకున్నారు.
అంటే.. భారీగా పెంచి.. అరబిందో ఫార్మా ఫౌండేషన్‌తో ఒప్పందం చేసుకున్నారు. ఒక్క నెలకు ఒక్కో వాహనంపై లక్ష నుంచి లక్షన్నర వరకు ఎక్కువ వసూలు చేస్తున్నారంటే.. ఐదేళ్లలో వెయ్యి కోట్లు అరబిందో ఫార్మా ఫౌండేషన్‌కు జమ పడతాయని కన్నా ఆరోపిస్తున్నారు. ఈ అరబిందో ఫార్మా ఫౌండేషన్‌కు విజయసాయిరెడ్డికి ఏమిటి సంబంధం అన్న చర్చ రావొచ్చు. అరబిందో రోహిత్ రెడ్డి విజయసాయిరెడ్డి అల్లుడు. విశాఖలో భూముల దగ్గర్నుంచి అనేక అంశాల్లో ఈ రోహిత్ రెడ్డి పేరు తరచూ తెరమీదకు వస్తోంది. ఇప్పుడు కన్నా.. ఈ విషయాన్ని తెల్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కాంట్రాక్టుల్లో ఎంపీ విజయసాయిరెడ్డి, ఆయన అల్లుడు రోహిత్ రెడ్డి, అరబిందో ఛైర్మన్ రామ్‌ప్రసాద్ రెడ్డి పాత్ర తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు.
మరి కన్నా అంటే కస్సుమని లేచే విజయసాయిరెడ్డి ఇప్పుడు… రూ. వెయ్యి కోట్ల స్కాంను.. తెరపైకి తెస్తే ఊరుకుంటారా..? తన ట్విట్టర్ ఖాతాలో మరోసారి కన్నాపై చెలరేగిపోవడం ఖాయమే. ఇది మరో వివాదం అవుతుందో.. హైకమాండ్ సర్దుబాటు చేస్తుందో చూడాలి మరి..!