జగన్ పై విశాఖలో జరిగిన దాడిని వీలైనంతగా సాగదీసే ప్రయత్నంలో వైకాపా ఉన్నట్టుంది. వైకాపా నేతల తీరు చూస్తుంటే, ఈ ఒక్క అంశంతోనే ఎన్నికల ప్రచారం చేస్తారేమో అన్నట్టుగా కనిపిస్తోంది. ఇదే అంశమై ఢిల్లీలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మరీ వైకాపా నేతలు మాట్లాడారు. ఆ పార్టీకి చెందిన ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రోద్బలంతో జరిగిన హత్యాయత్నం అని ఆరోపించారు. ఒక పథకం ప్రకారమే శ్రీనివాస్ ని విశాఖ విమానాశ్రయంలోని క్యాంటీన్లో పనిలో పెట్టారనీ, ఆరు నెలల కిందటి నుంచే జగన్ రాకపోకలపై నిఘా పెట్టారన్నారు.
పాదయాత్రలో అయితే జగన్ కి భద్రత ఉంటుందనీ, అదే విమానాశ్రయం అయితే ఎవ్వరూ ఉండరన్న విషయాన్ని గమనించి, అక్కడ జగన్ పై దాడికి ప్లాన్ చేశారని విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఈ కుట్రలో సీఎంతోపాటు మంత్రి లోకేష్, డీజీపీ, హర్షవర్థన్, సినీనటుడు శివాజీ కూడా ఉన్నారన్నారు! జగన్ పై జరిగింది హత్యాయత్నమే అని రిమాండు రిపోర్టులో చాలా స్పష్టంగా ఉన్నాసరే, దీని వెనక కుట్రదారులను పేర్లు ఎందుకు బయటపెట్టడం లేదన్నారు విజయసాయి రెడ్డి. రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదని తాము చెప్పలేదనీ, పోలీస్ వ్యవస్థను నడిపిస్తున్న డీజీపీ, ముఖ్యమంత్రికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి, నిజాలు బయటకి వచ్చే అవకాశం లేదన్నదే తమ అభిప్రాయమంటూ చెప్పారు.
పోలీసుల మీద నమ్మకం లేదని జగనే స్వయంగా చెప్పారు. ఆ తరువాత, మూడువేల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నప్పుడు భద్రతను ఇచ్చింది ఏపీ పోలీసులు కాదా అనే ప్రశ్న తెరమీదికి వచ్చింది. దీంతో ఇప్పుడు గొంతు సవరించుకుని… అబ్బే మేం పోలీసుల్ని అన్లేదు, పోలీస్ బాస్ మీద నమ్మకం లేదన్నామని విజయసాయి మాట మార్చారు. ఇంకోటి, పాదయాత్రలో అయితే జగన్ కి భద్రత ఉంటుందీ… విమానాశ్రయంలో ఉండదు కాబట్టి హత్య చేయడం ఈజీ అని ప్లాన్ చేశారని విజయసాయి చెప్పారు! అంటే, విమానాశ్రయాల్లో భద్రత ఉండదని ఆయన చెప్తున్నట్టా..? బయటతో పోల్చుకుంటే అక్కడే మరింత కట్టుదిట్టంగా ఉంటుంది. గుండుసూదిని కూడా లోపలికి వెళ్లనియ్యనంత నిఘా ఉంటుంది కదా! ఆర్నెల్ల కిందట్నుంచే కుట్ర జరిగిందని విజయసాయి ఏ ఆధారాలతో ఆరోపిస్తున్నట్టు..? గడచిన ఆర్నెల్లూ జగన్ ప్రతీ గురువారమూ విశాఖ విమానాశ్రయం నుంచే బయల్దేరి మర్నాడు కోర్టుకు వెళ్లడం లేదు కదా! గడచిన ఆర్నెల్లుగా విశాఖ సమీపంలో మాత్రమే ఆయన పాదయాత్ర చెయ్యడం లేదే! విజయసాయి ఆరోపణల్లో ఏపీ ప్రజలకు మరో లాజిక్ అర్థం కావడం లేదు… జగన్ ను హత్య చేయిస్తే తాము అధికారంలోకి వస్తామని టీడీపీ ఎలా భావిస్తుంది..? హంతకులు అనే ముద్ర వేయించుకుంటే ప్రజలు ఆదరిస్తారని ఎందుకనుకుంటారు..? ప్రజలు ఇలా ఆలోచిస్తున్నారని వైకాపా నేతలకు అనిపించడం లేదా..?