మన రాజకీయ నాయకులు ఎంత మేధావులో పలుమార్లు బయట పడుతూనే ఉంది. అసలు ఒక మనిషి చనిపోయినప్పుడు సంభ్రమాశ్చర్యాలు అనే పదం వాడకూడదు అన్న ఇంగితం లేని నాయకులు ఈ మధ్య ఎక్కువై పోతున్నారు. సంభ్రమాశ్చర్యాలు అనే పదం ఏదైనా ఆనందంతో కూడిన ఆశ్చర్యం కలిగినప్పుడు వాడతారు. చిన్నపిల్లలని మొదటిసారి ఏదైనా జూ కానీ లేదంటే ఏదైనా ఎగ్జిబిషన్ కి కానీ తీసుకెళ్ళినప్పుడు వారు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు అని అంటూ ఉంటాం. కానీ మన నేతల భావదారిద్ర్యం ఏమిటో కానీ ఒక వ్యక్తి మరణానికి సంభ్రమాశ్చర్యాలు అన్న పదం వాడుతున్నారు.
ఆమధ్య హరికృష్ణ మరణించినప్పుడు ఆయన మరణం తనను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది అని చెప్పి హరికృష్ణ సోదరుడు, నటుడు మాత్రమే కాక ఎమ్మెల్యే కూడా అయిన నందమూరి బాలకృష్ణ తెలుగు ప్రజలందరినీ విస్మయపరిచాడు. హరికృష్ణ మరణం సమయంలోనే కాకుండా మరొక సందర్భంలో కూడా ఒకరి మరణం తనను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది అని బాలకృష్ణ చెప్పినప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లు బాలకృష్ణ మీద విరుచుకుపడ్డారు. తెలుగు భాష మీద తనకు ఎంతో పట్టు ఉన్నట్లు మాట్లాడే బాలకృష్ణకు ఆ మాత్రం తెలియదా అంటూ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి.
ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన విజయసాయిరెడ్డి కూడా వివేకానంద రెడ్డి మరణం ప్రజలను సంభ్రమాశ్చర్యాలకు, దిగ్భ్రాంతికి గురి చేసింది అని మాట్లాడారు. “దిగ్భ్రాంతికి “అన్న ఒక్క పదం వాడేసి ఉన్నా సరిపోయేది కానీ అనవసరంగా మధ్యలో ఈ “సంభ్రమాశ్చర్యాలకు” అన్న పదాన్ని తీసుకువచ్చారు.
బాలకృష్ణ అంటే సోషల్ మీడియాకి దూరంగా ఉంటాడు కాబట్టి సోషల్ మీడియాలో నెటిజన్లు ఆయన మీద విరుచుకుపడ్డా బహుశా ఆయనకు తెలిసే అవకాశం లేదు. కానీ విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటారు. బాలకృష్ణ మీద “సంభ్రమాశ్చర్యాలు” అన్న పదం వాడినప్పుడు వచ్చిన విమర్శలు బహుశా ఆయనకు తెలిసే ఉండాలి. మరి తెలిసి పొరపాటున వాడారో లేక తెలియక వాడారో కానీ ఈ రోజు ఆయన కూడా వివేకానంద రెడ్డి మరణం సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది అంటూ మాట్లాడారు. ఇక ముందైనా కనీసం సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే విజయసాయి రెడ్డి లాంటి వారు ఇలాంటి తప్పులు చేయకుండా ఉంటారు అని ఆశిద్దాం.
– జురాన్ (@CriticZuran)