ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విజయసాయిరెడ్డి .. రాజ్యసభలో క్షమాపణలు చెప్పారు. ఆవేశంలో అనుచితంగా మాట్లాడానని అంగీకరించారు. తప్పు చేశానని.. చింతిస్తున్నానని క్షమించాలని కోరారు. తాను రాజ్యసభ చైర్మన్‌ను అగౌరవ పరచాలనుకోలేదని చెప్పుకొచ్చారు. ఆయనపై తనకు చాలా గౌరవం ఉందన్నారు. మరోసారి ఇలాంటి పరిస్థితి రానివ్వనని హామీ ఇచ్చారు. తన వ్యాఖ్యలను భేషరతుగా ఉపసంహరించుకుంటున్నానని ప్రకటించారు.
వెంకయ్యపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపడంతో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి… విజయసాయిరెడ్డిపై తీవ్రంగా విరుచుకుపడినట్లుగా ఢిల్లీలో ప్రచారం జరుగుతోంది. ట్విట్టర్లోనే కాదు… సాక్షాత్తూ చట్టసభల్లోనూ విజయసాయిరెడ్డి ప్రతి ఒక్కరిని తూలనాడుతూ ఉంటారు. ఈ క్రమంలో నాలుగు రోజుల కిందట టీడీపీ సభ్యుడు మాట్లాడిన మాటలను రికార్డుల నుంచి.. నిబంధనల ప్రకారం కాకుండా.. మాట వరుసగా అడిగినందుకు తొలగించలేదని వెంకయ్యనాయుడుపై టీడీపీకి లింక్ పెట్టి విమర్శలు చేశారు. తీవ్ర పదజాలంతో మండిపడ్డారు. ఆయన ప్రవర్తన చూసి..రాజ్యసభలోని బీజేపీ సభ్యులే కాదు… ఇతర పార్టీల నేతలు కూడా మండిపడ్డారు. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు ఆయనపై చర్య తీసుకోవాలని కోరారు. వెంకయ్యనాయుడు కూడా… తనను పని చేయకుండా చేసేందుకు ఇలా చేస్తున్నారని మండిపడ్డారు.
విజయసాయిరెడ్డి ప్రవర్తన రోజు రోజుకు దిగజారిపోతూండటంతో ఇతర సభ్యులు అలా ప్రవర్తించే అవకాశం ఉందని ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందేన్న డిమాండ్ అన్ని పార్టీల్లో వినిపిస్తూండటంతో విజయసాయిరెడ్డి క్షమాపణ చెప్పి ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. అందుకే ఆయన మరో మాట మాట్లాడకుండా సారీ చెప్పారు. అయితే చేయాల్సిందంతా చేసి.. అనాల్సినదంతా అనేది ఇప్పుడు సారీ అంటే సరిపోతుందా.. చర్య తీసుకుంటనే మరోసారి అలాంటి పరిస్థితి రాదని.. ఇతర సభ్యులు గీత దాటకుండా ఉంటారన్న అభిప్రాయాలు ఎంపీలు వినిపిస్తున్నారు.