విశాఖలో రూ. పదిహేను వందల కోట్ల విలువ చేసే ఓ భూ స్కాం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఆ భూమి చాలా కాలంగా నాగార్జున కన్స్ట్రక్షన్స్ కంపెనీ వద్ద ఉంది. కానీ ప్రభుత్వం ఆ భమి ఎందుకు ఇచ్చిందో దానికి ఉపయోగించలేదు. ఆ భూమి మధురవాడలాంటి అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఉండటంతో ఇప్పుడు ఆ భూమిని వెనక్కి తీసుకోవాల్సింది పోయి.. వేరే కంపెనీకి అమ్ముకునేందుకు పర్మిషన్ ఇచ్చారు. ఆ కంపెనీ విజయసాయిరెడ్డి అల్లుడి బినామీ కంపెనీ అని టీడీపీ నేతలు ఆందోళనలు చేస్తున్నారు. షరామామూలుగానే ఇదంతా టీడీపీ హయాంలో జరిగిందని వైసీపీ ఆరోపిస్తున్నారు. అలా జరిగితే రద్దు చేసి భూమి వెనక్కి తీసుకోవచ్చుగా అంటే సమాధానం ఉండదు.
అయితే విజయసాయిరెడ్డి నిన్న విశాఖలో హైడ్రామా నడిపారు. తనపై ఆరోపణలు చేస్తున్న టీడీపీ సభ్యులపై ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత మీడియాతో టీడీపీ హయాంలో జీవోలపై మాట్లాడారు. అయితే ఈ అంశంపై టీడీపీ నేత బండారు సత్యనారాయయణ మూర్తి ప్రెస్ మీట్ పెట్టి విజయసాయిరెడ్డి చెప్పిన విషయాల్లో కొన్ని కీలక అంశాలను వెల్లడించారు.
2019లో మార్కెట్ వాల్యూకి 20శాతం ఎక్కువ రేటు ప్రకారం ఇస్తామని చంద్రబాబు జీవో ఇచ్చారని దాని గురించి ఎందుకు మాట్లడలేదని ప్రశ్నించారు. ప్రస్తుతం భూమిని కట్టబెడుతున్న
జీఆర్పీఎల్ కంపెనీ గంటా స్నేహితుడు కొట్టు మురళిదని విజయసాయిరెడ్డి ఆరోపించారు. అయితే ఈ కొట్టు మురళి వైసీపీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ సోదరుడు. ఈ విషయాన్ని విజయసాయిరెడ్డి చెప్పలేదు. అంతే కాదు ఈ కొట్టు మురళీకి చెందిన రెండు ఎకరాల స్థలంలో విజయసాయిరెడ్డి పాగా వేశారని బండారు చెబుతున్నారు.
మొత్తంగా విశాఖలో రూ. పదిహేను వందల కోట్ల భూమిని అడ్డగోలుగా కొంత మందిబినామీలతో కొట్టేయ్యడానికి తీవ్రమైన ప్రయత్నాలు జరుగుతున్నాయని స్పష్టమైంది.కానీ టీడీపీ, వైసీపీ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు కానీ ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలన్న ఆలోచన చేయడం లేదు. దీంతో ఏదో గుట్టు ఉందన్న అనుమానం మాత్రం బలపడుతోంది.