విజయసాయిరెడ్డి జగన్ పై డైరక్ట్ ఎటాక్ చేస్తున్నారని విజయవాడలో సీఐడీ కార్యాలయం ముందు నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన మాటల్ని బట్టి ఎవరికైనా అర్థం అయిపోతుంది. లిక్కర్ స్కామ్ తో పాటు కాకినాడ పోర్టు వ్యవహారంలో ఆయన స్కామ్ జరిగిందని నిర్దారించారు. ప్రదాన సూత్రధారులు ఎవరో కూడా నేరుగా చెప్పారు. అదే సమయంలో తనకు తెలిసి జగన్ కు సంబందం లేదని కూడా అన్నారు. అంటే ఆ ప్రధాన సూత్రధారుల్ని పట్టుకుని నాలుగు పీకితే మీకే నిజాలు తెలుస్తాయన్న సంకేతాలను ఆయన ఆ మాట ద్వారా ఇచ్చారని అనుకోవచ్చు.
లిక్కర్ స్కామ్ లో కర్త, కర్మ, క్రియ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డి అని విజయసాయిరెడ్డి చెప్పారు. ఇంత భారీ స్కాంలు జరిగితే అంతిమ లబ్దిదారులు ఎవరు అవుతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. లిక్కర్ స్కామ్ చాలా పెద్దదని.. వేల కోట్లు దోచేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఐటీ సలహాదారుగా నియమితులై అసలు పని కాకుండా లిక్కర్ దందాను పూర్తిగా చక్కపెట్టే బాధ్యతలు తీసుకున్నారు. మొత్తం ఆయన చేతుల మీదుగానే నడిచింది. వాసుదేవరెడ్డి అనే అధికారిని బకరాగా పెట్టి మిగతా పనులు తాము పూర్తి చేసుకున్నారు. మిథున్ రెడ్డి మనీ రూటింగ్ చేశారు. మొత్తంగా చేరాల్సిన వారికి ఆ డబ్బుుల చేరాయి. ఈ విషయంలో తాను చెప్పాలనుకున్నది.. సందర్భం వస్తే సీఐడీకి చెబుతానని విజయసాయిరెడ్డి నేరుగానే చెబుతున్నారు.
పోర్టు వ్యవహారంలో అంతా విక్రాంత్ రెడ్డే ఛేశాడని కూడా విజయసాయిరెడ్డి చెబుతున్నారు. ఈ వ్యవహారంలో సీఐడీ ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చి ఉంటారు. అయితే మొత్తంగా అటు లిక్కర్ స్కాంలో కానీ ఇటు పోర్టు వ్యవహారంలో కానీ కీలకంగా ఉంది విజయసాయిరెడ్డి అల్లుడు కంపెనీలే. అదాన్ డిస్టిలరీస్ అనే కంపెనీ లిక్కర్ స్కాంలో కీలకం.ఈ కంపెనీ విజయసాయిరెడ్డి అల్లుడిది. అలాగే అరబిందో కాకినాడ పోర్టును కైవసం చేసుకుంది. కానీ తన అల్లుడి వ్యాపారాల్లో తాను జోక్యం చేసుకోలేదని అంటున్నారు.
విజయసాయిరెడ్డి తనకు భయం లేదని అన్నీ నిజాలే చెబుతానని సంకేతాలు పంపుతున్నారు. వైసీపీ ఆవిర్భావం రోజునే.. జగన్ రెడ్డికి భవిష్యత్ లేదని.. ఆయన కోటరీ నుంచి బయటకు రాకపోతే ఇక భవిష్యత్ అనేదే ఉండదని చెప్పడం ద్వారా.. విజయసాయిరెడ్డి.. జగన్ కు ఊహించని గట్టి హెచ్చరికలే పంపారని అనుకోవచ్చు.