నా ఎదవతనంతో పోలిస్తే.. నీ ఎదవతనం ఓ లెక్కా.. అంటూ కోటశ్రీనివాసరావు, శ్రీహరి.. ఒకరినొకరు ఎదవలు అయిపోతూ.. మంచి కామెడీ చేస్తారు బావగారూ.. బాగున్నారా సినిమాలో. అచ్చంగా అలాంటి క్యారెకక్టరే ఒకటి విశాఖలో తరచూ హడావుడి చేస్తుంది. ఆయన విజయసాయిరెడ్డి. కావాలనే ఆయన కొన్ని ఇష్యూల్ని హైలెట్ చేసి ప్రభుత్వాన్ని చిక్కుల్లో పెడుతున్నారు. తాజాగా ఆయన 104 ను పని చేయడం లేదని మీడియాకు చూపించారు. ప్రభుత్వ డొల్ల తనాన్ని ఎండగట్టడంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిది ప్రత్యేక శైలి. అయితే ఆయన శైలి ఎక్కువగా సొంత ప్రభుత్వాన్నే చిక్కుల్లో పెడుతుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం ఓ రేంజ్లో ఉన్నప్పుడు పార్లమెంట్లో ప్రశ్నలు అడిగి ఏపీ సర్కార్ కు అంతా తెలిసే జరుగుతుందన్న విషయాన్ని హైలెట్ అయ్యేలా చేశారు.
ఇప్పుడు కరోనా ఉద్ధృతి తీవ్రంగా ఉన్న సమయంలో.. ప్రభుత్వ పనితీరు చాలా ఘోరంగా ఉందని నిరూపించేందుకు ఇప్పుడు తన వంతు ప్రయత్నం చేశారు. 104 కాల్ సెంటర్ పడకేసిందని … మీడియాను తీసుకెళ్లి మరీ చూపించారు. వ ిశాఖలోనే మకాం వేసి.. రాజకీయాలు చేస్తున్న విజయసాయిరెడ్డి.. ఉత్తరాంధ్ర సీఎంగా వ్యవహరిస్తూంటారన్న విమర్శలు ఉన్నాయి. ప్రజలు ఎన్నుకున్న ఎంపీలు డమ్మీలుగా ఉండగా.. రాజ్యసభ సభ్యుడైన ఆయన మాత్రం విశాఖలో సమీక్షలు.. ఇతర అధికారాల్ని చెలాయిస్తూంటారు. ఈ క్రమంలో ప్రభుత్వం.. ముఖ్యమంత్రి జగన్ పదే పదే చెబుతున్న.. 104 కాల్ సెంటర్ సేవల్లోని నాణ్యతను మీడియాకు చూపించాలనుకున్నారు.
నేరుగా మీడియాను తీసుకుని విశాఖపట్నంలోని 104 కాల్ సెంటర్ కు వెళ్లారు. అక్కడి వెళ్లి అరగంట సేపు వేచి చూసినా ఒక్క కాల్ కూడా కాలేదు. అదేమిటని.. ఆయనే స్వయంగా 104కి ఫోన్ చేశారు. కానీ కనెక్ట్ కాలేదు. అప్పుడు కానీ అధికారులు అసలు విషయం చెప్పలేదు. సర్వర్‌లో సాంకేతికలోపం ఉందని చల్లగా చెప్పారు. దాంతో విజయసాయిరెడ్డికి మైండ్ బ్లాంక్ అయిపోయింది. మీడియా ముందు 104 పనితీరు గురించి… మంచిగా ప్రజెంట్ చేద్దమనుకుంటే.. బ్యాడ్‌గా వెళ్లిపోయిందని ఆయన గింజుకున్నారు. కానీ చేసేదేమీ లేదు. సీఎం జగన్ తో పాటు.. సాక్షి మీడియా ఎంతో గొప్పగా రోజూ ప్రచారం చేస్తున్న 104 డొల్లతనం .. అందరికీ తెలిసిపోయింది.