పూర్తిగా చంద్రముఖిగా మారిపోయిన గంగను చూడు.. అంటూ ఓ సినిమాలో రజినీకాంత్ చూపిస్తాడు! వైకాపా పొలిటికల్ సినిమాలో చంద్రముఖి ఎవరంటే.. భారతీయ జనతా పార్టీ. గంగ ఎవరంటే.. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అనుకోవచ్చు. ఆయన్ని అణువణువునా భాజపా ఆవహించేసింది. ప్రస్తుతం ఆ పూనకంలోనే ఉన్నారు. ఆయన ఢిల్లీలో చేస్తున్నది ఏపీ ప్రయోజనాల కోసం పోరాటం అని మరచిపోయి, కేంద్రంపై వారు పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని కూడా మరచిపోయి… నరేంద్ర మోడీకి కొమ్ము కాస్తూ, భాజపా గొంతుకగా విజయసాయి మారిపోయారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద బురద చల్లడం తప్ప, గడచిన వారం రోజులుగా ఆయన పార్లమెంటు ప్రాంగణంలో చేస్తున్నది ఏముంది..?
నారా చంద్రబాబు నాయుడు తనకు ఎదురైతే నమస్కరిస్తాననీ, ముఖ్యమంత్రిగా ఆయన్ని గౌరవిస్తానని ఆయనే అంటారు..! భారతీయ సంస్కృతి పట్ల అపార విశ్వాసం ఉన్న పార్టీ వైకాపా అని ఆయనే చెబుతారు. ఇంకోపక్క, ఒక తల్లికీ తండ్రికి నిజంగానే పుట్టి ఉంటే… అంటూ మాటల్లో రాయలేని దూషణలకు దిగుతారు. ఇక్కడికి వచ్చేసరికి భారతీయ సంస్కృతి ఏమైందండీ..? ముఖ్యమంత్రి స్థానానికి తాను గౌరవం ఇస్తానని అంటూనే… ప్రపంచంలోనే అతిపెద్ద గజదొంగ చార్లెస్ శోభరాజుతో చంద్రబాబును పోల్చుతున్నా అన్నారు. ఈ స్థాయిలో దిగజారుడు విమర్శలు చేస్తున్నప్పుడు సంస్కారం ఏమైందండీ..? ఇద్దరు ఆర్థిక నేరగాళ్లు సుజనా చౌదరీ, సీఎం రమేష్ లు సభలోనే ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి కలిసి తమ కష్టాలు చెప్పుకున్నారని ఆరోపించారు. కానీ, గత వారం పదిరోజులుగా పీఎంవో చుట్టూ ఎందుకు తిరుగుతున్నారని టీడీపీ అడిగేసరికి ఉక్రోషం ఎందుకు పొడుచుకు వచ్చేస్తోందండీ..! ఇన్నాళ్లూ కామ్ గా ఉండే విజయసాయికి ఏ స్థాయి అండ లభించకపోతే ఈ స్థాయికి దిగజారి మాట్లాడతారు..?
అరే, సాధిస్తామన్న ప్రత్యేక హోదా ఏమైందీ… కేంద్రాన్ని మెడలు వంచేస్తామని బయలుదేరి వెళ్లిన ప్రయత్నం ఏమైందీ… వీటి గురించి విజయసాయి మాట్లాడితే ఒట్టు..! చంద్రబాబును జైలుకి పంపిస్తా, అవినీతిపై కేసులు పెట్టిస్తా, ఇలాంటి ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి, విలువలున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండాలి… ఇదేనా విజయసాయి లక్ష్యం! రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యమంత్రిపై ఇంత దిగజారుడుగా నోరు పారేసుకున్నవారు లేరు. రానురానూ చంద్రబాబుపై భాజపా ఎక్కు పెడుతున్న బాణంగా విజయసాయి మారిపోతున్నారు.
ఒక చిన్న లాజిక్ ప్రజలకు తెలియదని ఎందుకు అనుకుంటున్నారు..? ఎలాంటి పొత్తూ లేకుండా, కేవలం భాజపా నేతలు భుజం తట్టేసరికే ఇంతగా విజయసాయి రెడ్డి రెచ్చిపోతున్నారు. కొత్తగా కొమ్ములొచ్చినట్టు కాలు దువ్వుతున్నారు. మరి, ఈ స్థాయి ప్రయోజనాలున్న భాజపా పొత్తును చంద్రబాబు ఎందుకు వదులుకున్నారు..? కేంద్రంలోని అధికార పార్టీతో వైరం పెంచుకోవడం ఆయనకి ఏమన్నా సరదానా..? రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం అనుకుంటే… ఏదో ఒకటి చెప్పి పొత్తులో కొనసాగొచ్చు. అయినాసరే, ఎందుకు తెంచుకున్నారో ప్రజలకు తెలీదా..? వైకాపాకి రాజకీయమే ముఖ్యం కాబట్టి, కేంద్రంలో తెలుగుదేశం వదిలేసిన చోటులో కాస్త సందు దొరికేసరికి వారి గొంతు లేచిందనేది ప్రజలకు అర్థం కాదని జగన్, విజయసాయి అండ్ కో అనుకుంటున్నారా..?