చంద్రబాబు తమ్ముడ్నని విజయసాయిరెడ్డి చెప్పుకుంటున్నారు. తన చెల్లెలు కుమార్తెను తారకరత్న పెళ్లిచేసుకున్నాడట. ఆ దారిలో తనకు చంద్రబాబు అన్నయ్య అయ్యాడంటున్నారు. ఇంత అర్జంట్‌గా ఎందుకు బంధుత్వం కలిపేసుకుంటున్నారంటే.. తన మెడకు చుట్టుకుంటున్న నకిలీ మద్యం వ్యవహారాన్ని దూరం చేసుకోవడానికే. తెలుగుదేశం పార్టీ నేతలు ఇటీవలి కాలంలో అదాన్ డిస్టిలరీ అనే కంపెనీ గురించి ఎక్కువ ప్రస్తావిస్తున్నారు. ఆ కంపెనీ విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డిదని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఏపీలో మద్యం సరఫరా చేస్తున్న కంపెనీల్లో అదాన్ డిస్టలరీ కీలకం.
వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఆ కంపెనీని పెట్టారు. వేల కోట్ల విలువైన మద్యాన్ని ఏపీ ప్రభుత్వానికి సరఫరా చేసింది. అదంతా నకిలీ మద్యమని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఆ కంపెనీ తమది కాదని.. తమ బంధువులు ఉన్నంత మాత్రాన తనది కాదని చెప్పడానికి చంద్రబాబుతో తనకు బంధుత్వ లాజిక్‌ను విజయసాయిరెడ్డి తెచ్చారు. పైన చెప్పిన లెక్కలో చంద్రబాబు తన అన్న కాబట్టి ఆయన ఆస్తులన్నీ తనవి అవుతాయా అని ప్రశ్నిస్తున్నారు. తన కుటుంబానికి అరబిందోలో తప్ప ఎక్కడా వ్యాపారాలు లేవన్నారు.
అదే సమయంలో విశాఖలో క్రూయిజ్ బిజినెస్ కూడా తమ కుమార్తెది కాదన్నారు. చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ డైరక్టర్లు చాలా మంది ఇతర కంపెనీల్లో డైరక్టర్లుగా ఉన్నారని.. వారు డైరక్టర్లుగా ఉన్న కంపెనీలన్నీ చంద్రబాబువేనా అని ప్రశ్నించారు. ఆ కంపెనీలన్నీ చంద్రబాబువి అయినా కాకపోయినా ఆవేమీ నకిలీ మద్యం తయారు చేయడం లేదన్న విషయం విజయసాయిరెడ్డి మర్చిపోయారు. ఎంత బంధుత్వం కలుపుకున్నా జరిగేది జరగక మానదని టీడీపీ నేతలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు .