వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టీడీపీకి ఎంత శత్రుత్వం ఉందో.. వైసీపీకి ఏబీఎన్ టీవీ చానల్‌కు అంతే శత్రుత్వం ఉంది. టీడీపీని, ఏబీఎన్‌ను వైసీపీ నేతలు వేర్వేరుగా చూడరు. అందుకే.. వాళ్లు ఎప్పుడో.. ఏబీఎన్ చానల్‌ను తమ వైపు రాకుండా నిషేధించారు. అసలు కవరేజీకే రానివ్వరు.. అలాంటిది ప్రత్యేక ఇంటర్యూలు ఇస్తారా..?. కానీ ఈ రూల్‌ను విజయసాయిరెడ్డి బ్రేక్ చేశారు. ఆయన స్వయంగా ఏబీఎన్ ప్రతినిధిని పిలిచి మరీ ఇంటర్యూ ఇచ్చారు. ఈ మార్పు.. విశాఖ జిల్లా ఎల్జీ పాలిమర్స్.. గ్యాస్ లీక్ ప్రభావిత గ్రామాల్లో జరిగింది.
గ్యాస్ ప్రభావం పూర్తిగా తగ్గిపోయిందని.. అక్కడ ప్రజలు నివసించవచ్చని భరోసా ఇచ్చేంమదుకు మంత్రులు, ఎంపీ విజయసాయిరెడ్డి రాత్రి గ్రామాల్లో బస చేశారు. పూర్తిగా.. కెమికల్స్ లేకుండా.. శుభ్రం చేసిన ఇళ్లలో బస చేశారు. అలా విజయసాయిరెడ్డి కూడా ఓ ఇంట్లో బస చేశారు. ఉదయమే లేచి ఆయన.. మంచం మీద కూర్చుని మీడియా ప్రతినిధులకు ఇంటర్యూలు ఇచ్చారు. సాధారణంగా విజయసాయిరెడ్డి అంటే… ప్రొ వైసీపీ మీడియాకు ప్రయారిటీ కాబట్టి.. వారందరూ ఆ ఇంటర్యూలను కవర్ చేశారు. అయితే.. అనూహ్యంగా ఏబీఎన్‌కు కూడా పిలుపు వచ్చింది. విశాఖ ప్రతినిధిని పిలిచి ఇంటర్యూ ఇచ్చారు. ఆ ఇంటర్యూను ఏబీఎన్ ప్రసారం చేసింది కూడా.
విజయసాయిరెడ్డి వ్యక్తిగతంగా ఏబీఎన్ చానల్ ఓనర్ రాధాకృష్ణపై విమర్శలు చేస్తూంటారు. కిరసనాయిల్ అనే పేరు పెట్టి మరీ తిడుతూ ఉంటారు. అలాంటిది అనూహ్యంగా ఇప్పుడు టీవీలకు పిలిచి మరీ ఇంటర్యూలు ఇచ్చేంత ఎందుకు మారిపోయారన్నది మీడియా వర్గాలను సైతం ఆశ్చర్యపరిచేలా చేసింది. తన కష్టానికి టీడీపీ అనుకూల మీడియాలోనూ కవరేజీ రావాలని ఆయన కోరుకుంటున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే… ఏబీఎన్ కు ఇంటర్యూ ఇవ్వడం అనేది యాక్సిడెంటల్‌గా జరిగింది కాదని.. అంతా తెలిసే ఇచ్చారని మాత్రం అందరికీ క్లారిటీ ఉంది.