మూడు రాజధానుల కోసం అంటూ గర్జించిన వైసీపీ గుంపులో విజయసాయిరెడ్డి కనిపించ లేదు. అసలు విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయితే ప్రధానంగా లాభపడేది ఆయన.. ఆయన కుటుంబమే. దీనికి సాక్ష్యంగా వందల ఎకరాల భూదందాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇవన్నీ నేరుగా ఆయన అల్లుడు, కుమార్తె పేరుపై కొనుగోలు చేసినవే. డాక్యుమెంట్ నెంబర్లతో సహా ఈనాడు దినపత్రిక బయట పెడుతోంది.
మూడురోజుల కిందట అవ్యాస్ పేరుతో విజయసాయిరెడ్డి అల్లుడు, కుమార్తె రెండేళ్ల కిందట ఏర్పాటుచేసిన కంపెనీ భూములు కొనడంలో మునిగిపోయింది. బ్లాక్ మనీ అంతా తెచ్చి భూములు కొనడానికన్నట్లుగా ఈ వ్యవహారాలు సాగిపోయాయి. అదే సమయంలో విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర సీఎంగా చెలామణి అవుతూ వస్తున్నారు. ఎక్కడ ఖాళీ భూమి కనిపిస్తే అక్కడ పాగా వేయడానికి ప్రత్యేకమైన బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దారికి రాని వారి భూముల్ని 22ఏలో చేర్చడం.. లేకపోతే వాళ్లపైకి బుల్డోజర్లతో వెళ్లిపోవడం కామన్ అయిపోయింది. ఇలా చేసి బెదిరింపులకు దిగి రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని ఆయన పార్టీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నేరుగానే ప్రకటించారు.
ఇప్పుడు ఈనాడు రెండో విడత ఆయన కుమార్తె, అల్లుడి భూదాహం గురించి పూర్తి వివరాలు వెల్లడించారు. ఈ డీల్స్ చూస్తే ఎవరికైనా మతిపోతుంది. అధికారం అడ్డం పెట్టుకుని ఇంత దారుణంగా దందాలు చేయగలరా అని ఆశ్చర్యపోయే పరిస్థితి. గతంలో చాలా మంది పాలకులు వచ్చారు.. వెళ్లారు. కానీ ప్రజల్ని.. వాళ్ల ఆస్తుల్ని ఇలా నిట్ట నిలువుగా దోచుకున్నవారు మాత్రం రాలేదు. వైసీపీ నేతల భూదందాలు చూస్తూంటే.. ఇక ముందు రారేమో అని కూడా అనిపిస్తుంది.
ఇంత స్పష్టంగా ఇన్ సైడర్ ట్రేడింగ్ కనిపిస్తున్నా.. వైసీపీ పెద్దలు కిక్కురుమనడం లేదు. ప్రజలు గొర్రెలు.. వాళ్లను మూడు రాజధానుల పేరుతో రెచ్చగొడితే సరిపోతుదని అనుకుంటున్నారు. విజయసాయిరెడ్డి విషయంలో వైసీపీ పెద్దలు ఓ నిర్ణయం తీసుకోకపోతే మొదటికే మోసం రావడం ఖాయం.