రెండు రోజుల కిందట… స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ మద్దతు ఇస్తుందా అని మీడియా ప్రతినిధులు విజయసాయిరెడ్డిని ప్రశ్నించారు. ఆయన నేరుగా సమాధానం చెప్పకుండా దాటవేశారు. ఆ తర్వాత నిన్న వైసీపీ హైకమాండ్ బంద్‌కు మద్దతు ప్రకటించాలని నిర్ణయం తీసుకుంది. ఆ విషయాన్ని పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. అప్పటికి విజయసాయిరెడ్డి క్లారిటీ వచ్చింది. వెంటనే వ్యూహం మార్చారు. ఎంతలా అంటే.. అసలు విశాఖలో స్టీల్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా ప్రైవేటీకరణ ఉద్యమానికి నేతృత్వం వహిస్తోంది తానే అనేంతగా ఆయన హడావుడి ప్రారంభించారు. ఉదయమే కార్యకర్తలతో రోడ్ల మీదకు వచ్చారు. మానవ హారాన్ని నిర్మించారు. ఓ మైక్ వెంట తెచ్చుకుని అక్కడున్న వారికి బంద్ ఎలా చేయాలో సూచనలు ఇచ్చారు.
ఆయన హడావుడి చూసి అందరూ.. ముక్కున వేలేసుకోవాల్సి వచ్చింది. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు.. కార్మిక సంఘాలు.. వామపక్షాల నేతలు.. ఇతర రాజకీయ పార్టీలు అన్నీ మద్దతు ప్రకటించినా… బంద్ ఎలా చేయాలో అలా చేశారు. కానీ విజయసాయిరెడ్డి మాత్రం అందరూ బంద్ చేస్తూంటే… తాను దానికి నాయకత్వం వహిస్తున్నానని చెప్పుకునేందుకు ప్రాధాన్యం ఇచ్చారు. ఈ ప్రాసెస్‌లో ఆయనకు కొన్ని చోట్ల ఎదురు దెబ్బలు తగిలాయి. ఓ చోట కమ్యూనిస్టు పార్టీకి చెందిన కార్మిక సంఘం కార్యకర్త ఒకరు పోస్కోతో ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని విజయసాయిరెడ్డిని కోరారు. అయితే ఒప్పందమే జరగలేదని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. కానీ జరిగిందని చెప్పడంతో విజయసాయిరెడ్డికి కోపం కట్టలు తెంచుకుని… అధికారంలేకుండా మాట్లాడవద్దని చెప్పి వెళ్లిపోయాడు. ఇంకో చోట… బంద్ చేస్తున్న వామపక్ష నేతలపై ఈసడించుకున్నారు.
అసలు బంద్ చేసే విధానం అదేనా అన్ని వాహనాలు వెళ్లిపోతున్నాయని వారి మీద రుసరుసలాడారు. మీ హడావుడి చాలు కానీ.. ఇక్కడ బంద్ చేస్తున్న వారిలో మీ కార్యకర్తలెవరవైనా ఉంటే చూపించమని సదరు నాయకులు అడిగే సరికి… విజయసాయిరెడ్డికి వారిపైనా కోపం వచ్చింది. విజయసాయిరెడ్డి తీరు చూసి… కార్మిక నేతలు ఆశ్చర్యానికి గురయ్యారు. చెప్పే మాటలకు.. చేసే చేతలకు పొంతన లేదని.. మండిపడ్డారు. అయినా విజయసాయిరెడ్డి… తన మీడియాలో పబ్లిసిటీ కోసం ఏం చేయాలో అది చేశారు. రాబట్టుకున్నారు. ఆయన నేతృత్వంలోని సోషల్ మీడియా ఆయనకు కవరేజీ ఓ రేంజ్ లో ఇచ్చింది. కావాల్సింది అదే కాబట్టి.. ఆ లక్ష్యాన్ని విజయసాయిరెడ్డి అందుకున్నారని కొంత మంది సెటైర్లు వేస్తున్నారు.