సీఐడీ ఎదుట హాజరైన విజయసాయిరెడ్డి అన్నీ విషయాలు రాజ్ కసిరెడ్డికే తెలుసని చెప్పారు. ఈ విషయాన్ని ఆయనే చెప్పారు. లిక్కర్ పాలసీపై తన ఇంట్లో రెండు సమావేశాలు జరిగాయని సీఐడీ వాళ్లు చెబితే నిజమేనని అంగీకరించారు. ఆ సమావేశాల్లో రాజ్ కసిరెడ్డి, మిథున్ రెడ్డి కూడా పాల్గొన్నారని విజయసాయిరెడ్డి చెప్పారు. కానీ లంచాలు.. మద్యం తయారీ.. వాటాల గురించి మాత్రం తనకమీ తెలియదని చెప్పారట. అలాగే ఇతర ఏ ప్రశ్న అడిగినా అదే చెప్పారు. బిగ్ బాస్ ఉన్నారో లేదో.. రాజ్ కసిరెడ్డి వసూళ్లు చేసి ఎవరికి ఇచ్చారో తనకు తెలియదని చెప్పారు. మూడు గంటల పాటు సీఐడీ విజయసాయిరెడ్డిని ప్రశ్నించింది. ఇందులో ఆయన అల్లుడి కంపెనీ లావాదేవీల అంశాన్ని కూడా ప్రశ్నిస్తే.. అవి తాను అరబిందో నుంచి రాజ్ కసిరెడ్డి కంపెనీలకు వంద కోట్లు ఇప్పించిన అప్పులని చెప్పారు. అందులో నిజం ఎంత ఉందో ఆయనకే తెలియాలి.
అయితే మీడియా ఏ అంశాలకు ప్రాధాన్యం ఇస్తుందో తెలుసు కాబట్టి సీఐడీ విచారణ తర్వాత విజయసాయిరెడ్డి వాటి గురించే మాట్లాడారు. రాజ్ కసిరెడ్డి మోసం చేశాడని .. ఆయన తెలివైన క్రిమినల్ అని చెప్పుకొచ్చారు. తనను ఘోరంగా మోసం చేశాడని.. ఆయనను నమ్మి తాను మోసపోయానని చెప్పుకొచ్చారు. రాజ్ కసిరెడ్డిని ప్రోత్సహించి తప్పు చేశానని పార్టీలో వాళ్లే ఆయనను పరిచయం చేశారన్నారు. రాజ్ కసిరెడ్డితో ఆర్థిక లావాదేవీలు అప్పులే అని వాదించడానికి విజయసాయిరెడ్డి ప్రయత్నించారు. పనిలో పనిగా ఆయన రాజకీయాలనూ ప్రస్తావించారు.
సాక్షి పత్రికను పెట్టించింది తానేనని ఇప్పుడు తన పై తప్పుడు కథనాలు రాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీలో చేరి రాజ్యసభకు వెళ్లబోతున్నట్లుగా సాక్షిలో ప్రచారం చేస్తున్నారనని.. తాను వ్యవసాయం చేసుకుంటా..ఇంకేదైనా చేసుకుంటా.. సాక్షికెందుకని ప్రశ్నించారు. ఇప్పటి వరకూ తాను రాజ్యసభ సీటివ్వాలని ఎవర్నీ అడగలేదన్నారు. ప్రజలు కోరితే రాజకీయాల్లోకి వస్తానని చెప్పుకొచ్చారు. పనిలో పనిగా కోటరీపైనా వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధికారంలో లేనప్పుడు అన్నీ తానే చూసుకుని రెండో స్థానంలో ఉంటే.. అధికారంలోకి వచ్చాక రెండు వేలో స్థానానికిపోయానన్నారు. కోటరీ అవమానాల వల్లే తాను పార్టీని వీడానని చెప్పుకొచ్చారు.
రాజ్ కసిరెడ్డి తెలివైన క్రిమినల్ అవునో కాదో కానీ విజయసాయిరెడ్డి మాత్రం డబుల్ గేమ్ చాలా సేఫ్ గా ప్లే చేస్తున్నారని ఆయన తీరును బట్టి అంచనా వేయవచ్చు. ఆయన జగన్ పై ఈగ వాలనీయడం లేదు.. కానీ రాజ్ కసిరెడ్డిని బలి చేయడానికి పూర్తి స్థాయి స్టఫ్ ఇస్తున్నారు. ఆయనది మామూలు తెలివి కాదని రాజకీయవర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. రాజ్ కసిరెడ్డిని ముందు పెట్టి దోచుకున్న వాళ్లు ఇప్పుడు ఆయనను బలి చేయడానికి పక్కా ప్లాన్ తో ఉన్నారని విజయసాయిరెడ్డి వ్యవహారంతో తేలిపోతోందని అనుమానిస్తున్నారు.