విజయసాయిరెడ్డి జగన్ రెడ్డిని బయట తలుచుకుంటారో లేదో కానీ.. చంద్రబాబు జపం చేయకపోతే మాత్రం ఆయనకు తెల్లారదు. సందర్భం లేకపోయినా రాజ్యసభలో మాట్లాడే అవకాశం వస్తే.. ఆయన చంద్రబాబు పాట అందుకుంటున్నారు. ఇతర పార్టీల వాళ్లు… ముఖం మీద ఖాండ్రిస్తారేమో అన్నట్లుగా విమర్శలు చేస్తున్నా తగ్గరు. రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ పై జరిగిన చర్చలో చంద్రబాబు ప్రస్తావన తీసుకు వచ్చారు.
ప్రతిపక్ష నేత చంద్రబాబు తానే అన్నీ కనిపెట్టానని చెప్పుకుంటారని, కంప్యూటర్, సెల్ ఫోన్ కూడా తానే కనిపెట్టానని అంటారని, అలాంటి వ్యక్తి గురించి లోతుగా చర్చించాలన్నారు. ఒకవేళ నిజంగానే చంద్రబాబు అవన్నీ కనిపెడితే, వాటిపై పేటెంట్ కు భారత్ దరఖాస్తు చేసుకుంటే కోట్ల రూపాయల్లో మనకు ఆదాయం వస్తుందని వెటకారంగా అన్నారు. బీఆర్ఎస్, డీఎంకే సహా చాలా మంది సభ్యులు ఆయన్ను వారించారు, సబ్జెక్ట్ మాట్లాడాలన్నారు. ఎవరు వారించినా వినకుండా విజయసాయి, చంద్రబాబుపై కామెంట్లు చేస్తూనే ఉన్నారు.
పదే పదే చంద్రబాబు ప్రస్తావన తేవడం రాజ్యసభ విజయసాయి తీరుపై అసహనం వ్యక్తమవుతోంది. బెయిల్ పై ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడటం ఏమిటని నేరుగానే ప్రశ్నిస్తారు. చంద్రబాబు ప్రస్తావన తేవడం మాత్రం చాలామంది ఇతర పార్టీల నేతలకు ఇష్టంలేదు. సభలో లేని వ్యక్తి గురించి, ప్రస్తుతం జైలులో ఉన్న వ్యక్తి గురించి మరీ అంత వ్యంగ్యంగా మాట్లాడటం అవసరమా అంటున్నారు. కానీ విజయసాయిరెడ్డి అనే వ్యక్తి పెద్దల సభలో ఉన్న నికృష్ణుడని… ఆయనకు ఇవేమీ పట్టవన్న విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి.