రహస్యం అంటేనే నలుగురికీ తెలియనిది అని అర్థం కదా! అందుకే మరి, తనకు తెలిసిన విషయాలను ఎవ్వరికీ చెప్పకుండా… తనకు చాలా తెలుసు అంటూ అధికార పార్టీపైనా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపైనా తీవ్రమైన ఆరోపణలు చేస్తుంటారు వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి. తాజాగా ఆయన విశాఖలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ… తమ పార్టీలో చేరేందుకు చాలామంది టీడీపీ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారన్నారు. అయితే, వారందరి విషయమై తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉందనీ, అనంతరం వారు ఎవరనేది ఏంటో అందరికీ తెలుస్తుందన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవినీతిని బయటపెట్టి, ఆయన్ని బోనులో నిలబెట్టేవరకూ నిద్రపోను అన్నట్టుగా ఆ మధ్య ఢిల్లీలో విజయసాయి దీక్షబూనిన సంగతి తెలిసిందే. చంద్రబాబు చేసిన అవినీతి గురించి ప్రధానికి ఫిర్యాదు చేయడం కోసమే పీఎంవో చుట్టూ తిరిగానని అన్నారు. అయితే, ఇప్పుడు ఆ మాటను కాస్త మార్చుకుని… వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లపై చర్యలు చేపడతామంటున్నారు. అంతేకాదు, అవినీతిలో వీరిద్దరికీ సహకరించిన అధికారులకు కూడా కఠిన శిక్షలు ఉంటాయని విజయసాయి హెచ్చరించేస్తున్నారు..!
నిజానికి, విజయసాయి తాటాకు చప్పుళ్లు రొటీన్ అయిపోయాయి! ముఖ్యమంత్రి అవినీతి చేశారని అంటున్నారే తప్ప.. ఆ ఆధారాలేంటో బయటపెట్టరు! విజయమాల్యా దగ్గర వందల కోట్లు పుచ్చుకున్నారని అంటారు తప్ప… వాటి ఆధారాలు చూపరు! విదేశాల్లో అవినీతి సొమ్మును సీఎం దాచుకున్నారని అంటారు తప్ప… ఆ వివరాలూ చెప్పరు! ఇప్పుడేమో, చాలామంది టీడీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారనీ… జగన్ నిర్ణయించాకనే చేర్చుకుంటామని అంటున్నారు! విజయసాయి రెడ్డి చేసే ఆరోపణలన్నీ రహస్యాల్లానే ఉంటున్నాయి. ఆయనకు తప్ప వేరెవ్వరికీ ఆ విషయాలు తెలియవన్నట్టుగా మాట్లాడతారు. అవేవో బయటపెట్టేస్తే వైకాపాకే మేలు జరుగుతుంది కదా. తాజాగా, టీడీపీ నేత యలమంచిలి రవి వైకాపాలో చేరారు. టీడీపీని వీడుతున్నట్టు ఆయనే ముందుగా ప్రకటించేశారు. ఒకవేళ టీడీపీ నుంచి దూరమయ్యేందుకు కొందరు ఎమ్మెల్యేలు నిజంగానే సిద్ధంగా ఉంటే… ఈపాటికే వారి వైఖరిలో తేడా, వారి ప్రవర్తనలో మార్పు మీడియాలోకి వచ్చి ఉండేది కదా! వారి అనుచరులో అనుయాయులో ఎవరో ఒకరు ఎక్కడో ఒకచోట పార్టీ మార్పు అంశం చర్చించుకునేవారు. ఒకవేళ అలా సిద్ధపడ్డవారుంటే వారి పేర్లను ముందుగా వైకాపానే లీక్ చేస్తుంది కదా!