ఒకే అంశం గురించి ఎవరైనా పదేపదే అదే పనిగా మాట్లాడితే… ఆ అంశమంటే ఆ వ్యక్తికి భయమైనా కావొచ్చు, తనలోని ఆందోళనను అవతలి వ్యక్తులు గుర్తించేస్తారేమో అనే కప్పిపుచ్చుకునే ధోరణి కావొచ్చు, తాను అనుకుంటున్నదానికి విరుద్ధంగా పరిస్థితులు ఉన్నాయే అనే ఆవేదనకు ప్రతిస్పందన కావొచ్చు! వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి ఈ మధ్య చేస్తున్న ట్వీట్లుగానీ, వ్యాఖ్యలుగానీ చూస్తుంటే… ఇలాంటి లక్షణాలే కనిపిస్తున్నాయి. తాజాగా ఆయన ఒక ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేశారు! అది విమర్శ కూడా కాదు.. అక్కసు. ఏదో ఒక అంశాన్ని బేస్ చేసుకుని చేస్తే దాన్ని విమర్శ అనొచ్చు.
‘చంద్రబాబు విద్రోహి, యూటర్న్ మాస్టర్, నిరుపేదల వ్యతిరేకి, మైనారిటీల వ్యతిరేకి, రైతుల వ్యతిరేకి, అతిపెద్ద అవినీతిపరుడు, అసమర్థుడు’ అచ్చంగా ఇవే కామెంట్లతో తయారు చేసుకున్న ఒక స్లైడ్ షోని ట్వీట్ చేశారు. ప్రజలను ఒకసారి మోసం చెయ్యొచ్చుగానీ… అన్నిసార్లూ చంద్రబాబు నాయుడు మోసం చెయ్యలేరని వ్యాఖ్యానించారు. ఇక, విశాఖపట్నంలో పార్టీ నేతలతో ఆయన మాట్లాడుతూ… జగన్ పాలనను ఒక సువర్ణాధ్యాయంగా మిగిలిపోవాలని జనం కోరుకుంటున్నారనీ, జగన్ ని చూడాలని జనానికి ఉంది, ఆయన చెప్పేది వినాలనుంది, పార్టీని అధికారంలోకి తేవాలని ఉంది, ముఖ్యమంత్రిగా చూడాలని ఉంది.. అంటూ మాట్లాడారు.
ఇవి ఒక పార్లమెంటు సభ్యుడు స్థాయిలో చేసే వ్యాఖ్యల్లా ఉన్నాయా అనే అనుమానం కలుగుతుంది కదా! చంద్రబాబు నాయుడుపై కేవలం వ్యక్తిగత భావోద్వాగాలను మాత్రమే వెళ్లగక్కుతున్నారు విజయసాయి. ఇది ప్రజలకు అవసరం లేని కోణం! చంద్రబాబు అంటే వ్యక్తిగతంగా విజయసాయికి పడుతుందా లేదా అనేది రాజకీయాలకు సంబంధం లేని విషయం. అంశాలవారీగా విమర్శలు చేస్తే అర్థం ఉంటుంది. అంతేగానీ, ద్రోహీ, వ్యతిరేకీ, అసమర్థుడు.. ఇలాంటి విమర్శల ద్వారా కేవలం తమలోని అక్కసును, అధికార కాంక్షను మాత్రమే బయటపెట్టుకున్నట్టు అవుతుంది. ఇంకోటి.. జగన్ ని ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారు అని ప్రజల తరఫున కూడా మాట్లాడేస్తున్నారు. జగన్ ముఖ్యమంత్రి కావాలనేది వైకాపా లక్ష్యం… దాన్ని రాష్ట్ర ప్రజల అవసరంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు తమ అవసరాలు, భవిష్యత్తు చూసుకుంటారు. ఆ కోణం నుంచి తమకు భరోసాగా ఉండే నాయకత్వం ఎవరు ఇవ్వగలరనేది బేరీజు వెసుకుని అధికారాన్ని కట్టబెడతారు. అంతేగానీ, ఒక పార్టీ లక్ష్యానికి అనుగుణంగా ప్రజలు స్పందిస్తున్నారని చెప్పడం మరీ విడ్డూరం. మొత్తానికి, విజయసాయి రెడ్డి వ్యాఖ్యల్లో ట్వీట్లలో తెలియని ఓ గందరగోళానికి ఆయన గురౌతున్నారేమో అనే అనుమానం కలుగుతోంది.