గత కొద్ది నెలలుగా వైఎస్ఆర్సిపి తో ఆంధ్రప్రదేశ్ బిజెపి పార్టీ కుమ్మక్కు అయిందని, ఆ కారణంగానే పవన్ కళ్యాణ్ ఇటీవల బీజేపీ కి దూరంగా జరుగుతున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకూ ఆ ప్రచారాన్ని పెద్దగా పట్టించుకోని బిజెపి, సరిగ్గా తిరుపతి ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీపై విమర్శలు మొదలెట్టింది. అయితే మొదటిగా విజయసాయిరెడ్డి బిజెపి మీద విమర్శ చేయగా వాటిని సోము వీర్రాజు తిప్పికొట్టారు. అయితే ట్విట్టర్ వేదికగా జరుగుతున్న ఈ వార్ నిజమేనా లేక ఎన్నికల ముందు మభ్యపెట్టే ప్రయత్నమా అన్న సందేహాలు ప్రజల్లో ఉన్నాయి వివరాల్లోకి వెళితే..
ఆంధ్ర బీజేపీపై విజయసాయి పంచ్:
విజయసాయిరెడ్డి ట్వీట్ చేస్తూ, “తిరుపతి ఉప ఎన్నికల ముందు మీరు వేస్తున్న డ్రామాలకు జనం నవ్వుకుంటున్నారు. ఉప ఎన్నికల్లో డిపాజిట్లు వస్తే చాలు మన వాడు సీఎం అయిపోతాడన్నట్లు నటిస్తున్నారు. ఎవరి పాత్రల్లో వారు జీవించండి…చెవిలో క్యాబేజీ పూలు పెట్టండి. జనం మాత్రం మళ్లీ వైసీపీనే దీవిస్తారు.” అంటూ రాసుకొచ్చారు.
సోము వీర్రాజు కౌంటర్ :
అయితే విజయసాయిరెడ్డి ట్వీట్ కు కౌంటర్ ఇచ్చారు సోము వీర్రాజు. ఆయన ట్వీట్ చేస్తూ, “మా ఊసు ఎందుకులే @VSReddy_MP గారూ..!!! కోర్టులకు చెవులో పువ్వులు పెడుతూ బయట మేకపోతు గాంభీర్యంతో తిరుగుతున్నా లోపల గోళ్లు కొరుక్కుంటున్నారంటగా అలీబాబా నలభై దొంగలంతా. తిరుపతి ప్రజలకి మేం ఏం ఇచ్చామో చెప్పి క్యాబేజి పువ్వులు మీకు పంపిస్తాం బెయిల్ రద్దవగానే కూరకి లోపల ఉపయోగపడతాయి.” అని రాసుకొచ్చారు.
మా ఊసు ఎందుకులే @VSReddy_MP గారూ..!!!
కోర్టులకు చెవులో పువ్వులు పెడుతూ బయట మేకపోతు గాంభీర్యంతో తిరుగుతున్నా లోపల గోళ్లు కొరుక్కుంటున్నారంటగా అలీబాబా నలభై దొంగలంతా.తిరుపతి ప్రజలకి మేం ఏం ఇచ్చామో చెప్పి క్యాబేజి పువ్వులు మీకు పంపిస్తాం బెయిల్ రద్దవగానే కూరకి లోపల ఉపయోగపడతాయి. https://t.co/zBBj1GoOm7
— Somu Veerraju / సోము వీర్రాజు (@somuveerraju) March 29, 2021
నిజమైన యుద్ధమా లేక తూతూ మంత్రం పోరాటమా?
అయితే, బీజేపీ వైకాపా ల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందనే అభిప్రాయం, రాష్ట్ర బీజేపీ నాయకులు కొందరు అధికార వైఎస్ఆర్సిపి తో కుమ్మక్కు అయ్యారు అన్న ప్రచారం జనసైనికులే కాకుండా ప్రజల్లోకి కూడా బలంగా వెళ్ళింది. పైగా విష్ణువర్ధన్ రె డ్డి జీవీఎల్ వంటి నేతలు గత కొంత కాలంగా వైఎస్ఆర్సిపి కి ఏ రకంగా మద్దతుగా ఉన్నారో ప్రజలు చూస్తూనే ఉన్నారు. విష్ణువర్ధన్ రెడ్డి అయితే తనకు జన్మనిచ్చిన పార్టీ కంటే తన సామాజిక వర్గానికి చెందిన నాయకులు స్థాపించిన పార్టీపై ఎంత అభిమానం చూపిస్తారో ఆయన గతంలో చేసిన ట్వీట్ల ద్వారా ప్రజలందరికీ బహిర్గతం అయింది. జీవీఎల్ అయితే ఇప్పుడు కూడా తిరుపతి ఉప ఎన్నిక తర్వాత టిడిపి కనుమరుగవుతుంది అని వ్యాఖ్యానిస్తున్నారు తప్పించి వైఎస్సార్సీపీపై దూకుడుగా ఒక వ్యాఖ్య కూడా చేయడం లేదు.
రాష్ట్ర బిజెపి నాయకుల వైఖరితో విసిగిపోయిన పవన్ కళ్యాణ్ ఒకవేళ ప్రచారానికి రాను అంటే కేంద్ర నాయకత్వం తమకు మొట్టికాయలు వస్తుందన్న భయంతోనే రాష్ట్ర బిజెపి నేతలు పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థి అని ప్రకటించడం, విజయసాయిరెడ్డి లాంటి నేతలు చేసే ట్వీట్లకు కౌంటర్ ఇవ్వడం వంటివి చేస్తున్నారనే అభిప్రాయం ఇప్పుడు కూడా ప్రజల్లో ఉంది. గత ఆరు నెలల్లో వైఎస్సార్సీపీని బిజెపి గట్టిగా ఇరుకున పెట్టిన సందర్భం ఒక్కటి కూడా లేదంటేనే బిజెపి ఏ స్థాయిలో పోరాటాలు చేస్తుందో అర్థం అవుతోంది.
అయితే ఇప్పటికైనా మించి పోయింది లేదు. బిజెపి కేంద్ర నాయకత్వాన్ని తిరుపతి ప్రచారానికి రప్పించడం, బెంగాల్ మమతా బెనర్జీ మీద విరుచుకు పడే స్థాయిలో జగన్ ప్రభుత్వం చేస్తున్న తప్పులను బిజెపి కేంద్ర పెద్దలు తూర్పార పట్టడం, జనసేన బీజేపీ మధ్య ఎటువంటి గ్యాప్ లేదని బలమైన సంకేతాలు ఇవ్వడం వంటివి చేస్తే – కనీసం పరువు నిలబెట్టుకునే స్థాయిలో బిజెపి అభ్యర్థి ఓట్లు సంపాదించుకోవచ్చు. లేదంటే ఎన్నికల తర్వాత- 2019 తో పోలిస్తే కాస్తోకూస్తో బిజెపికి ఓట్లు పెరిగాయని చెప్పుకోవడానికి మాత్రమే ఈ ఉప ఎన్నిక బిజెపికి పనికొస్తుంది.