విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్… ఇద్దరూ ఇద్దరే! నటన, క్రేజ్‌లోనే కాదు, పారితోషికాలు అందుకోవడంలోనూ.. ఆ పై షరతులు విధించడంలోనూ. ఇద్దరిలో ఓ కామన్ పాయింట్ ఉంది. ఇద్దరూ ప్రమోషన్లకు రారు. వచ్చినా `ఇంతిస్తే వస్తాం` అని షరతు విధిస్తారు. పారితోషికంతో పాటు.. ప్రచారం కోసం కూడా వాళ్లకు స్పెషల్ గా సొమ్ము ముట్టజెప్పాలి.
ఉప్పెనలో భారీ పారితోషికం అందుకొని మరీ నటించాడు విజయ్‌సేతుపతి. కానీ ఆ సినిమా ప్రమోషన్లలో అణుమాత్రం కూడా కనిపించలేదు. ప్రమోషన్‌కి రావాలంటే రూ.75 లక్షలు ఇవ్వాలని అడిగితే.. మైత్రీ మూవీస్ లైట్ తీసుకొంది.
పుష్పలో.. ఫహద్ కనిపించాడు. ఈ సినిమా ప్రమోషన్లలో ఫహద్ లేడు. ప్రమోషన్లకు డబ్బులు అడగడంతో… మైత్రీ ఫహద్‌ని పక్కన పెట్టింది. ఇప్పుడు వీరిద్దరూ కలిసి `విక్రమ్`లో నటించారు. కమల్ హాసన్ నటిస్తూ, నిర్మించిన సినిమా ఇది. ఈ సినిమా ప్రమోషన్లలోనూ ఫహద్, విజయ్ సేతుపతి లేనే లేరు. `విక్రమ్` ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ఫహద్, విజయ్ సేతుపతి రానే లేదు. కమల్ అంటే.. ఇద్దరికీ గౌరవమే. ఇద్దరూ కమల్ ని చూసి, కమల్ లా నటించి ఎదిగినవాళ్లే. కానీ… సినిమా దగ్గరకు వచ్చేసరికి.. వాళ్ల షరతులు వాళ్లకున్నాయి. వారిద్దరికీ పారితోషికంతో పాటు, ప్రచారం కోసం కూడా డబ్బులు ఇవ్వడానికి కమల్ కూడా లైట్ తీసుకోవడంతో… విజయ్, ఫహద్ ఇద్దరూ విక్రమ్ ప్రమోషన్లకు ఎంచక్కా డుమ్మా కొట్టేశారు.