ప్రపంచ ప్రఖ్యాత బౌలర్ ముత్తయ్య మురళీధరన్ జీవిత కథ సినిమాగా రాబోతోంది. `800` పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ముత్తయ్య పాత్రని విజయ్‌సేతుపతి పోషిస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన లుక్ కూడా బయటకు వచ్చింది. అందులో ముత్తయ్యగా విజయ్ లుక్ చూసి, ఫ్యాన్సంతా షాక్ కి గురయ్యారు. ముత్తయ్య లుక్ నూటికి నూరుపాళ్లూ..దించేశాడు విజయ్. షూటింగ్ మొదలుకాకపోయినా, లుక్ చూశాక ఈ సినిమాపై జనాలకు నమ్మకం కలిగింది. విజయ్ సేతుపతి మరో అద్భుతం సృష్టించబోతున్నాడని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్.
అయితే కొంతమంది మాత్రం విజయ్ సేతుపతిపై పండిపడుతున్నారు. మరీ ముఖ్యంగా తమిళాభిమానం మెండిగా ఉన్న జనాలు విజయ్‌పై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. శ్రీలంకలో చాలామంది తమిళులు అణచివేతకు గురవుతున్నారు. శ్రీలంకలో జాతి వివక్షత మరింత ఎక్కువ. తమిళుల పట్ల నిర్దాక్షణ్యంగా ప్రవర్తిస్తున్నారు. అలాంటి దేశానికి సంబంధించిన వ్యక్తిపై బయోపిక్ తీయడం, అందులో ఓ తమిళ హీరో నటించడం వాళ్లకు నచ్చడం లేదు. దాంతో `షేమ్ఆన్ విజయ్‌సేతుపతి` అంటూ ట్విట్టర్లో ట్రెండింగ్ ప్రారంభించారు. విజయ్‌కి తమిళులపై కృతజ్ఞతాభావం లేదని మండిపడుతున్నారు.
సినిమాని సినిమాగా చూడాలన్నది తమిళ సినీ జనాల మాట. ఓ గొప్ప క్రికెటర్ జీవితం తెరపైకి వస్తుందని, దాన్ని ఆ కోణంలోనే చూడాలని తమిళ జనాల్ని కాస్త శాంతింపజేసే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే తమిళులకు జాతి అభిమానం ఎక్కువ. భాష, జాతికి భంగం కలిగించే వ్యక్తుల్ని, విషయాల్ని వాళ్లేమాత్రం అంగీకరించరు. ఈ పాయింటే ఈ సినిమాకీ, విజయ్ కీ తలనొప్పిగా మారే ప్రమాదం ఉంది.