మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్‌తో ‘ఉప్పెన’ సినిమా నిర్మిస్తోంది మైత్రీ మూవీస్. మైత్రీ మూవీస్ అనే బ్యానర్ వాల్యూ, మెగా అల్లుడి సినిమా అనే విషయాలు మినహాయిస్తే – ప్రత్యేకమైన అంశాలేం ఈ సినిమాకి లేవు. అందుకే వీలైనంత స్టార్ వాల్యూ జోడించాలని మైత్రీ తపన పడింది. అందుకే విజయ్ సేతుపతిని రంగంలోకి దింపింది. ఈ సినిమాలో విజయ్ ప్రధాన విలన్. ఎప్పుడైతే విజయ్‌సేతుపతి ఎంట్రీ ఇచ్చాడో అనుకున్నట్టే ‘ఉప్పెన’కు క్రేజ్ వచ్చింది. అయితే ఇప్పుడు విజయ్ సేతుపతి పారితోషికం పేరుతో.. నిర్మాతల్ని పిండుకోవడం ప్రారంభించాడని టాక్.
ఈ సినిమా కోసం ముందుగా 2.5 కోట్లకు ఒప్పందం జరిగింది. అయితే మధ్యలో చిత్రీకరణకు బ్రేక్ పడింది. కాల్షీట్లు పెరిగాయి. దాంతో విజయ్‌సేతుపతి పారితోషికాన్నీ పెంచేశాడు. మరో 1.5 కోట్లు డిమాండ్ చేస్తున్నాడని తెలుస్తోంది. విజయ్ సేతుపతిపై తెరకెక్కించాల్సిన సన్నివేశాలు ఇంకా ఉన్నాయి. అందుకే.. విజయ్ అడిగినంత ఇవ్వక తప్పడం లేదు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి పాత్ర 45 నిమిషాల వరకూ ఉంటుందని తెలుస్తోంది. విజయ్‌లాంటి స్టార్‌ని తీసుకొచ్చినప్పుడు సన్నివేశాలన్నీ చక చక తీసేసి, కాల్షీట్ల సమస్య రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత దర్శక నిర్మాతలదే. కానీ… సుకుమార్ శిష్యుడి సినిమా ఇది. సుకుమార్ లానే నిదానంగా తీయడం మొదలెట్టాడు. దాంతో విజయ్‌సేతుపతి క్యాష్ చేసేసుకున్నాడు. ఈ సినిమాకి ముందు నుంచీ బడ్జెట్ ఎక్కువైపోతోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. దానికి విజయ్‌సేతుపతి కూడా ఓ కారణమయ్యాడు.