మెగా మేనల్లుడు, సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా మైత్రీ మూవీస్ ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి `ఉప్పెన` అనే పేరు ఖరారు చేసిన సంగతి తెలిసిందే. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో ప్రతినాయకుడిగా విజయ్ సేతుపతిని ఎంచుకున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ ప్రాజెక్టు నుంచి విజయ్ సేతుపతి తప్పుకున్నాడని, ఆ పాత్రలో మరో నటుడు కనిపించనున్నాడని చెప్పుకున్నారు. అయితే అవన్నీ గాలి వార్తలే అని తేలింది. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా విజయ్నే నటిస్తున్నాడు. ఈరోజు ఆయన సెట్లో కూడా అడుగుపెట్టారు. ప్రస్తుతం హైదరాబాద్లోని సారధి స్టూడియోలో చిత్రీకరణ జరుగుతోంది. విజయ్ సేతుపతి ఈ రోజు నుంచి షూటింగ్లో పాల్గొంటున్నారు. విజయ్, వైష్ణవ్ తేజ్, రాజీవ్ కనకాలపై ప్రస్తుతం సీన్లు తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికి నలభై శాతం చిత్రీకరణ పూర్తయింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని 2020లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.