ఉప్పెనపై భారీ గాఖర్చు పెడుతోంది మైత్రీ మూవీస్. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్‌ని కథానాయకుడిగా పరిచయం చేస్తున్న సినిమా ఇది. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నాడు. దేవిశ్రీ సంగీతం అందిస్తున్నాడు. ప్రతినాయకుడి పాత్ర కోసం విజయ్ సేతుపతిని తీసుకొచ్చారు. ఈ సినిమాకి పాతిక కోట్లు బడ్జెట్ అయ్యిందని చిత్రబృందమే చెబుతోంది. ఓ కొత్త హీరో సినిమాకి ఈ స్థాయిలో ఖర్చు పెట్టడం గ్రేటే.కాకపోతే… విజయ్ సేతుపతికే ఏకంగా ఆరు కోట్లు ఇవ్వాల్సివచ్చింది.
నిజానికి విజయ్ డిమాండ్ చేసింది నాలుగు కోట్లే. కానీ మైత్రీ మూవీస్ కాస్త అతి తెలివితో ఆలోచించిందిక్కడ. విజయ్ సేతుపతికి రోజువారీ 20 లక్షల పారితోషికం ఇచ్చి, 15 రోజుల్లో విజయ్ షెడ్యూల్ ముగించాలని చూసింది. అలా చేస్తే గనుక కోటి రూపాయలు కలిసొచ్చేవి. కానీ.. అనుకోకుండా షూటింగ్ డేస్ పెరిగాయి. 15 రోజులు కాస్త 30 రోజులు అయ్యింది. అలా ఆరు కోట్ల పారితోషికం విజయ్ కి ఇవ్వాల్సివచ్చింది. నాలుగు కోట్లతో పోయేది… ఆరు కోట్లు చేసుకున్నారన్నమాట.