విజయ్‌సేతుపతి కథల్ని ఎంచుకోవడంలో మాస్టర్. ఎప్పుడూ ఒకే తరహా పాత్రలు చేయడు. ఒకే తరహా క్యారెక్టర్లలో కనిపించడు. ఎప్పుడు ఎలాంటి టర్న్ తీసుకుంటాడో చెప్పలేం. యాక్షన్, ఫీల్ గుడ్ సినిమాలు చేస్తూ చేస్తూ.. సడన్ గా కామెడీ హీరోగా మారిపోయాడు. తమిళ సినిమా `జుంగా` కోసం. 2018లో విడుదలైన సినిమా ఇది. ఇప్పుడు `ఆహా`లో డబ్బింగ్ రూపంలో వచ్చింది. `విక్రమార్కుడు` పేరుతో.
డాన్ కథలు చాలా చూశాం. ఇదీ డాన్ కథే. కాకపోతే.. ఇతనో పరమ పిసినారి డాన్. మర్డర్ చేయడానికి సుమోలో వెళ్తూ.. దారిలో.. పాజింజర్లని ఎక్కించుకుని, వాళ్ల దగ్గర డబ్బులు వసూలు చేసేంత పిసినారి డాన్. డాన్ల సంఘం మీటింగ్ కి వెళ్లి, అక్కడ మిక్చర్ పొట్లాలని ఎత్తుకొచ్చేంత పీసాసి. అంతెందుకు.. ఫ్టైట్ లో పులిహోర పొట్లాల్ని అమ్మి, అక్కడిచ్చే బన్నుల్ని పెట్టెలో దాచుకుని వచ్చే క్యారెక్టర్. ఇంత ఫన్నీగా తీర్చిదిద్దాడు దర్శకుడు ఆ పాత్రని. ఆ ఫన్… ఈ సినిమాకి శ్రీరామ రక్ష.
కథలోకి వెళ్దాం.. జుంగా (విజయ్‌సేతుపతి) ఓ బస్ కండెక్టర్. తనది డాన్ల వంశం. తన తాత డాన్. తన తండ్రి డాన్. కానీ… డాన్ వ్యాపారంలో చాలా నష్టపోయారు. ఎంతో ఇష్టపడి కట్టుకున్న థియేటర్ ని సైతం అమ్ముకోవాల్సివస్తుంది. ఈ ఫ్లాష్ బ్యాక్ తెలిసిన జుంగా.. ఊగిపోతాడు. తానూ డాన్ గా మారి, డాన్ వ్యాపారం కూడా లాభసాటిదే అని నిరూపించి, ఆ థియేటర్ని సొంతం చేసుకుంటానని అమ్మ (శరణ్య)కి మాటిస్తాడు. డాన్ అయిపోతాడు. అయితే.. పరమ పిసినారి. పైసా కూడా ఖర్చు పెట్టడు. అలా పోగేసిన సొమ్ముతోనే థియేటర్ని సొంతం చేసుకోవాలనుకుంటాడు. అందుకోసం పారిస్ కూడా వెళ్లాల్సివస్తుంది. చెన్నైలో ఉండాల్సిన జుంగా.. పారిస్ ఎందుకు వెళ్లాడు? అక్కడ యాళిని (సాయేషా సైగల్)తో ఉన్న లింకేంటి? అనేది మిగిలిన కథ.
అల్లరి నరేష్ చేసే.. కామెడీ తరహా పాత్రని విజయ్‌సేతుపతి ఈ సినిమాలో చేశాడు. ఓ రకంగా డాన్ లపై ఇదో సెటైర్. అలా డాన్లపై సెటైర్ వేసిన ప్రతీ సీన్ పేలింది. కాకపోతే.. తమిళ ఓవరాక్షన్ ఎక్కువగా కనిపిస్తుంది. తొలి సన్నివేశాలు అంతగా రక్తి కట్టవు. శరణ్య ఫ్లాష్ బ్యాక్ చెప్పడంతో.. కథలో కామెడీ పెరుగుతూ వస్తుంది. జుంగా చేసే పిసినారి చేష్టల వినోదం పంచుతాయి. దానికి తోడు యోగిబాబు కామెడీ బాగానే వర్కవుట్ అయ్యింది. పారిస్ లో కిడ్నాప్ డ్రామా అంతా నసలా అనిపిస్తుంది. ఆ కిడ్నాప్ ని చాలా సిల్లీగా తీశారు. అయితే … పారిస్ లో కూడా జుంగా తన పిసినారి బుద్ధిని పోనిచ్చుకోకపోవడం, బన్ పెట్టీ, పెట్టీ యోగిబాబుని విసిగించడం, డబ్బుల్ని ఆదా చేయడానికి విలన్ డెన్ వరకూ… నీటిలో ఈదుకుంటూ వెళ్లడం నవ్విస్తాయి. జుంగా బామ్మ ఎపిసోడ్ హిలేరియస్‌గా సాగుతుంది. ఈ సినిమాలో అందరికంటే ఎక్కువ నవ్వించింది ఆ పాత్రే.
విజయ్ సేతుపతిని ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. తెలుగులోనూ అభిమానులు ఏర్పడ్డారు. అయితే వాళ్లందరికీ ఇందులోని విజయ్‌సేతుపతి గెటప్ ఏమాత్రం నచ్చదు. మేకప్ విషయంలో విజయ్‌సేతుపతి శ్రద్ధ తీసుకోలేదనిపిస్తుంది. తన ఆకారం చాలా వికారంగా ఉంటుంది. విజయ్ కామెడీ ఏమాత్రం చేయగలడో.. జుంగా పాత్రతో నిరూపితమైంది. యోగిబాబు కూడా నవ్వుల్ని పంచడంలో పార్ట్ తీసుకున్నాడు. ఇద్దరు హీరోయిన్ల పాత్రలూ.. నామమాత్రమే. ఆయేషా అందంగా కనిపించింది. శరణ్య అలవాటు ప్రకారం, తమిళ డోసుకి తగ్గట్టుగానే ఓవరాక్షన్ చేసింది.
ఆహా వాళ్లు డబ్ చేశారో, డబ్ చేశాక.. ఆహాకి వచ్చిందో తెలీదు గానీ, డబ్బింగ్ క్వాలిటీ చాలా అధమ స్థాయిలో ఉంది. పాటలైతే ట్యూన్‌కి తగ్గట్టుగా పదాలు పేర్చేశారంతే. అర్థం, అందం రెండూ లేవు. `మీ అమ్మమీదొట్టు.. అయ్యమీదొట్టు.. అక్కమీదొట్టు.. చెల్లెమీదొట్టు..` అంటూ ఓ పాట ఉంది. ఒట్టు… ఆ పాట విన్నాక.. డబ్బింగ్ పాటలపై ఉన్న గౌరవం మొత్తం పారిపోతుంది. మిగిలిన పాటలన్నీ అలానే సాగాయి. ఈ సినిమాకి విజయ్ సేతుపతినే నిర్మాత. అక్కడ తన పాత్రకు తగ్గట్టు పిసినారి తనం చూపించాడు. దర్శకుడు గోకుల్ కామెడీ సెన్స్ బాగుంది. ఏమాత్రం విషయం లేని కథని పట్టుకుని.. నవ్విస్తూ.. కాలక్షేపం చేసేశాడు. విజయ్ సేతుపతి గెటప్పుల్ని భరిస్తూ.. పాటల్ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తూ.. కామెడీ మాత్రమే ఎంజాయ్ చేస్తూ.. ఈ సినిమాని నిరభ్యంతరంగా చూసేయొచ్చు.