హుజురాబాద్‌లో ఓటమి తర్వాత వరంగల్‌లో విజయగర్జన పెట్టాలనుకున్న టీఆర్ఎస్కు ఏదీ కలసి రావడం లేదు. ఓటమి తర్వాత విజయగర్జన యాప్ట్‌గా లేకపోవడమే కాదు.. వరుసగా ఆ సభను వాయిదా వేయాల్సి వస్తోంది. మొదట పదిహేనో తేదీన నిర్వహించాలనుకున్నారు. తర్వాత ఇరవై తొమ్మిదో తేదీకి వాయిదా వేశారు. ఇప్పుడు ఆ తేదీన కూడా నిర్వహించడం లేదు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావడంతో ..ఈసీ అంగీకరించదని అందువల్ల సభను వాయిదా వేస్తున్నట్లుగా టీఆర్ఎస్ తెలిపింది.
దీంతో సభ మళ్లీ జరుగుతుందా లేదా అన్నదానిపై స్పష్టత లేకుండా పోయింది. ఇన్ని సార్లు వాయిదా పడిన సభను నిర్వహించడం కన్నా ఈ సారి ఆవిర్బావ దినోత్సవం రోజు నిర్వహించడం మంచిదన్న ఆలోచన ఇప్పటికే ఆ పార్టీ నేతల్లో ఉంది. స్థానిక సంస్థ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఈ రోజే అమల్లోకి వచ్చింది. డిసెంబర్ పదిహేనో తేదీ వరకూ అమల్లో ఉంటుంది. సభ పెడితే అప్పుడు పెట్టాలి. అప్పుడు పెడతారా లేదో టీఆర్ఎస్ అధికారికంగా చెప్పలేదు. కానీ వాయిదా విషయం మాత్రం ప్రకటించారు.
ఇటీవల వరంగల్‌లో సభకు స్థల సేకరణ కూడా పెద్ద ఇబ్బందికరంగా మారింది. రైతులు తమ పొలాల్లో సభ నిర్వహించడానికి అంగీకరించడం లేదు. ప్రస్తుత రాజకీయ పరిణామాలతో టీఆర్ఎస్ నేతలు కూడా అంత హుషారుగా లేరు. దీంతో కనీవినీ ఎరుగని రీతిలో సభ నిర్వహించి ప్రతిపక్షాలకు షాక్ ఇవ్వాలనుకున్న టీఆర్ఎస్ అధినేత లక్ష్యం వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. అన్ని వాయిదాల తర్వాత నిర్వహించినా ఆ హుషారు ఉంటుందో లేదో చెప్పడం కష్టమే .