ప్రతీ రాజకీయ పార్టీలోకొందరు గెస్ట్ ప్లేయర్స్ ఉంటారు. ఎప్పుడో అవసరంపడినప్పుడే వారు ప్రజల ముందుకు వచ్చి తమ పార్టీ తరపున వఖాల్తా పుచ్చుకొని మాట్లాడుతుంటారు. వైకాపాలో కూడా అటువంటి ఇద్దరు గెస్ట్ ప్లేయర్స్ ఉన్నారు. వారిలో ఒకరు పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ. మరొకరు ఏ పదవీలోను లేని షర్మిల. విజయమ్మ కనబడి చాలా రోజులయిందే అని జనం అనుకొంటుంటే శనివారం ఆమె జగన్ దీక్షలో ప్రత్యక్షమయ్యారు.
ఆ సందర్భంగా ప్రజలను ఉద్దేశ్యించి ఆమె ఎక్కడా తడబడకుండా చాలా చక్కగా ప్రసంగించారు. “నా కొడుకు జగన్ రాజకీయ పార్టీ పెట్టిన తరువాత అతనిని మీ చేతులోనే పెట్టాను. అప్పటి నుండి అతను రాష్ట్రంలో ఎవరు ఎక్కడ ఆత్మహత్యలు చేసుకొన్నా, ప్రజలకు ఏ సమస్య ఎదురయినా తక్షణమే వచ్చి వారికి అండగా నిలబడి పోరాడుతున్నాడు. కనుక అతనిని మీరు ఆశ్వీరదించాలి. రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఎందుకు వెనకాడుతోందో, అది వెనకడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు దానిని గట్టిగా అడగడం లేదో నాకు తెలియదు కానీ ప్రజల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం నా కొడుకు జగన్ పోరాడుతున్నాడు. దాని వలన అతనికి వ్యక్తిగతంగా వచ్చే లాభం ఏమీ లేదు. కేవలం ప్రజల కోసమే అతను పోరాడుతున్నాడు. కనుక రాష్ట్ర ప్రజలందరూ అతనికి అండగా నిలబడి పోరాడాలి. ఆ పోరాటం ఎంత తీవ్రంగా ఉండాలంటే రాజధాని శంఖుస్థాపన చేయడానికి వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ అది చూసి తక్షణమే ప్రత్యేక హోదా ఇస్తున్నట్లు ప్రకటించాలి,” అని అన్నారు.