విజయ్ మాల్యా ను భారత్ కు అప్పగించాలని లండన్ లోని వెస్ట్‌మినిస్టర్ కోర్టు బ్రిటన్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రూ.9 వేల కోట్ల మేరకు బ్యాంకులను మోసం చేయడం, మనీలాండరింగ్‌కు పాల్పడటం వంటి ఆరోపణలతో ప్రస్తుతం ఆయనపై సీబీఐ, ఈడీ దర్యాప్తు జరుపుతున్నాయి. ఆయన ఇండియా నుంచి పారిపోయి లండన్ లో తలదాచుకుంటున్నారు. 2016 మార్చిలో లండన్ వెళ్ళిపోయారు. దీంతో ఆయనను భారతదేశానికి అప్పగించాలని భారత ప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది. సుదీర్ఘ విచారణ అనంతరం సోమవారం ఆయనను భారతదేశానికి అప్పగించాలని కోర్టు ఆదేశించడంతో భారతదేశం దౌత్యపరమైన విజయం సాధించినట్లయింది.
ఈ తీర్పుపై మాల్యా అపీలు చేయడానికి అవకాశం ఉంది. దీని కోసం పదిహేను రోజుల గడువు ఇచ్చింది. దీంతో.. మాల్యాను అప్పగించాలని ఆదేశించినా.. సమయం పట్టే అవకాశం ఉంది. భారత ప్రభుత్వ అభ్యర్థనపై వెస్ట్‌మినిస్టర్ కోర్టు 2017 డిసెంబరు 4 నుంచి విచారణ జరుపుతోంది. క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ దర్యాప్తు చేసింది. మానవ హక్కులకు సంబంధించిన కారణాలను చూపుతూ మాల్యాను భారతదేశానికి అప్పగించేందుకు ఎటువంటి అడ్డంకులు లేవని ఈ దర్యాప్తు నివేదిక వెల్లడించింది. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ చతికిలబడటం అనివార్యమని మాల్యాకు ముందే తెలుసునని, బ్యాంకు రుణాలను తిరిగి చెల్లించాలనే ఉద్దేశం ఆయనకు ఎప్పుడూ లేదని పేర్కొంది.
మొత్తంగా చూస్తే.. మాల్యా అప్పగింత విషయం అంత తేలిగ్గా సాకారం అయ్యే అవకాశాలు లేవన్న మాట వినిపిస్తోంది. ముంబైలో ఇప్పటికే జైలులో ప్రత్యేక ఏర్పాట్లతో సెల్ ను సిద్దం చేశారు. తనను భారత్ కు అప్పగించడం ఖాయమన్న సూచనలు రావడంతోనే… ఆయన గత వారంలో.. మొత్తం సొమ్మును చెల్లిస్తానంటూ ప్రకటనలు చేసినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఎగవేత దారు అనే ముద్రను తనపై తీసేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు