హైదరాబాద్: సీబీఐ మాజీ డైరెక్టర్ విజయరామారావు ఇవాళ మీడియా ముందుకు వచ్చారు. తన కొడుకు కళ్యాణ శ్రీనివాస్ నకిలీ ఇన్వాయిస్లతో వివిధ బ్యాంకుల వద్ద రు.304 కోట్ల మేర రుణాలు తీసుకుని ఎగ్గొట్టారన్న ఆరోపణలపై ఇవాళ హైదరాబాద్లో మీడియా సమావేశంలో స్పందించారు. తన కొడుకు నిర్దోషి అని, ఏ తప్పూ చేయలేదని చెప్పారు. త్వరలోనే ఆధారాలతో దీనిని నిరూపిస్తామని అన్నారు. తాను సీబీఐ మాజీ డైరెక్టర్గా కాదని, తండ్రిగానే మాట్లాడుతున్నానని చెప్పారు. విజయరామారావు కొడుకు కాబట్టే ఈ కేసుకు ఇంత పబ్లిసిటీ వచ్చిందని అన్నారు. ఈ కేసుపై తాను ప్రభావం చూపలేనని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తాను రిటైర్ అయ్యి 20 ఏళ్ళు అయిందని గుర్తు చేశారు. తన కొడుకు నిర్దోషి అని చెప్పటానికి తనవద్ద ఆధారాలు ఉన్నాయని, అయితే తాను ఈ సమయంలో ఆ వివరాలను బయటపెట్టలేనని, అలా చేస్తే తమకు నష్టం జరుగుతుందని విజయరామారావు అన్నారు. తాను ఎలాంటివాడినో అందరికీ తెలుసని, తన జీవితం ఓపెన్ బుక్ అని చెప్పారు. తన కొడుకు పేరుమీద క్రాప్ లోన్స్ తప్ప మరే రుణాలు లేవని చమత్కరించారు.