ఏపీ సర్కారుపై వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి చేస్తున్న ఆరోపణలు తెలిసినవే! అవినీతి మార్గాల్లో సంపాదించిన సొమ్మును సీఎం విదేశాలకు తరలించారని ఆ మధ్య ఆరోపించారు. దానికి ఆధారమేదయ్యా అంటే… మాటల్లేవ్! ఇక, తిరుమల తిరుపతి దేవస్థానం విషయమై ఆయన చేసిన ఆరోపణలూ తెలిసినవే. వేంకటేశ్వర స్వామివారికి సంబంధించి నగల్ని చంద్రబాబే దొంగలించారనీ, తెలంగాణ పోలీసులూ లేదా సీబీఐ ఆయన ఇంట్లో సోదా చేస్తే దొరుకుతాయని ఆ మధ్య విమర్శించారు. ఈరోజు కూడా మళ్లీ అదే ఆరోపణ చేస్తున్నారు. ఈ ఆరోపణలకు సంబంధించిన టీటీడీ తనకు నోటీసులు ఇవ్వలేదనీ, ఇచ్చే హక్కు కూడా లేదని వ్యాఖ్యానించారు.
ఒకవేళ టీటీడీ నోటీసులు ఇస్తే, దాన్ని నోటీసు అనకూడదనీ, అదనపు సమాచారం మాత్రమే తన దగ్గర నుంచి వారు కోరుతున్నట్టుగా అభ్యర్థన అవుతుందని చెప్పారు! ‘ఎవరైనా ఒక వ్యక్తి ఒక సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ పెట్టుకుని, దానితో ఏదైనా ఒక ఆరోపణ చేసినట్టయితే.. ఆ సోర్స్ ఏంటీ అని ప్రశ్నించే అధికారం తప్పు చేసిన వ్యక్తులకు ఉండదు’ అని విజయసాయి చెప్పారు. ‘చంద్రబాబు నాయుడు దొంగతనం చేశాడు, దోపిడీ చేశాడు, తవ్వుకుని వెళ్లాడు. స్వయానా ముఖ్యమంత్రి కొడుకు ఈ సొమ్మును విదేశాలకు తరలించాడు అనేది ఆరోపణ’ అన్నారు. అయితే, తనకున్న సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ను మాత్రం ప్రశ్నించే అధికారం వారికి లేదన్నారు. ‘అలా చెయ్యాలంటే.. ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రి, దైర్భాగ్యపు ముఖ్యమంత్రి ముందుగా సీబీఐ ఎంక్వయిరీ వెయ్యాలి. తనే ముద్దాయిగా నిలబడాలి. ఒక విట్నెస్ గా మమ్మల్ని పిలవాల’ని వివరించారు.
విజయసాయి చెప్తున్నది ఏంటంటే… ఆయన ఆరోపిస్తారు, ఆధారాలు అడక్కూడదు! ఆధారాలు కావాలంటే సీబీఐ ఎంక్వయిరీ వెయ్యాలట! అప్పుడు ఒక సాక్షిగా ఆయన వచ్చి ఆధారాలు బయటపెడతారట! గమనించాల్సిన ఇంకో కోణం కూడా ఉందండోయ్. తాను చేసే ఆరోపణలపై సీబీఐ ఎంక్వయిరీ వేస్తే తప్ప ఆధారాలు చూపనని ఆయన డిమాండ్ చెయ్యొచ్చు, కానీ.. ఆయన ఆరోపణలను ప్రశ్నించే అధికారం ఇతరులకు ఉండకూడదట. ఆధారాలు దగ్గర పెట్టుకుని, ఆరోపణలు చేస్తున్న వ్యక్తుల్ని ప్రశ్నించకూడదని ఈయన ఎలా సూత్రీకరిస్తారు..? ఇష్టమొచ్చిన ఆరోపణ చేసేస్తాం, ప్రతీదానికీ సీబీఐ ఎంక్వయిరీ వేయించుకోండని శాసించే హక్కు ఈయనకి ఉంటుందా..? ఆధారాలన్నీ అంత బలంగా ఉన్నప్పుడు నేరుగా కేసులు పెట్టొచ్చు కదా. ఢిల్లీకి వెళ్లి ప్రధాని కార్యాలయంలో ఫిర్యాదులు చెయ్యొచ్చు కదా. సీబీఐ ఎంక్వయిరీకి ఆదేశించమని కేంద్రాన్ని ఒత్తిడి చెయ్యొచ్చు కదా… మీడియా ముందు ఎందుకీ వివరణలూ విశ్లేషణలూ సూత్రీకరణలూ చర్చలూ.?