ఢిల్లీలో పార్లమెంటు ఆవరణలో మరోసారి మీడియాతో మాట్లాడారు ప్రతిపక్ష వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై యథా ప్రకారం విమర్శలే చేశారు. గాంధీ విగ్రహం ముందు ప్లకార్డులు పట్టుకుని, ప్రత్యేక హోదా కోసం మరోసారి డిమాండ్ చేశారు. కేంద్రంలో రాబోయే ప్రభుత్వం ఏదైనా సరే, ఆంధ్రాకి ప్రత్యేక హోదా ప్రకటించాల్సిన అవసరం ఉందన్నారు. ఇది రాష్ట్ర ప్రజల డిమాండ్ కాదనీ, ఇది ఏపీ ప్రజల హక్కు అన్నారు. అనంతరం, కడప ఉక్కు కర్మాగారానికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయడాన్ని ప్రస్థావించారు.
కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణ వ్యయాన్ని రూ. 18 వేల కోట్లు అని చెబుతున్నారనీ, అది కేంద్రం నిర్మించాల్సిన ప్రాజెక్టు అని విజయసాయి అన్నారు. కడప ఉక్కు కర్మాగారంతో ఆయనకేం పని అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ప్రశ్నించారు. ఆయన శంకుస్థాపన చేసింది చంద్రబాబుకు బినామీగా ఉంటున్న సీఎం రమేష్ ఫ్యాక్టరీ కోసమని ఎద్దేవా చేశారు. రాజధాని విషయంలో కూడా ప్రజలకు కేవలం గ్రాఫిక్స్ మాత్రమే చూపించారనీ, రాష్ట్రంలో జరిగిందని చెప్పుకుంటున్న అభివృద్ధి కూడా అలానే గ్రాఫిక్స్ లోనే ఉందంటూ విజయసాయి రెడ్డి విమర్శించారు. ఇలాంటి దుర్మార్గపు ముఖ్యమంత్రిని గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారంటూ ఆయన వ్యాఖ్యానించారు.
కరెక్టే… కడప ఉక్కు కర్మాగారం కేంద్రం నిర్మించాల్సిన ప్రాజెక్టే! విభజన చట్టంలో ఉన్న అంశమే. కానీ, కేంద్రంలోని భాజపా దాన్ని అమలు చేయకపోతే ఎవరైనా ఏం చెయ్యాలి..? ముఖ్యమంత్రి చొరవ తీసుకుంటే తప్పేంటి..? ఎలాగో ఒకలా రాష్ట్రంలో ఫ్యాక్టరీ నిర్మాణానికి పునాదులు పడ్డాయన్న సంతోషం వైకాపా నుంచి ఆశించలేమనుకోండి! కానీ, ఈ సమయంలో కూడా కేంద్రాన్ని వెనకేసుకొస్తున్న ధోరణి విజయసాయి మాటల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. కడపలో ఉక్కు కర్మాగారం కేంద్రం బాధ్యత అని ఆయనే చెబుతున్నారు కదా… మరి, ఏపీలో ప్రతిపక్ష పార్టీగా ఆ ఫ్యాక్టరీ సాధన కోసం వారు నిర్వర్తించిన బాధ్యత ఏది..? ఇవ్వనంటూ భీష్మించుకున్న కేంద్రంపై పోరాటం చేశారా, ఇప్పటికైనా భాజపాను నిలదీస్తున్నారా..? కడప కర్మాగారానికి శంకుస్థాపన జరిగిన ఈ తరుణంలో కూడా ఇది చంద్రబాబు బాధ్యత కాదనే కోణంలోనే మాట్లాడుతున్నారు తప్ప… కేంద్రం వదిలేసిన బాధ్యతను విజయసాయి ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు..?