విశాఖకు వైసీపీ ఇంచార్జ్‌గా వైవీ సుబ్బారెడ్డిని జగన్ నియమించారు. ఇతర ఉత్తరాంధ్ర జిల్లాలను బొత్సకు ఇచ్చారు. విజయసాయిరెడ్డికి ఉత్తరాంధ్ర ఇంచార్జ్ అనే పదవి పోయింది. ఆయన రాష్ట్ర కార్యాలయంలో వైసీపీ అనుబంధ విభాగాలకు ఇంచార్జ్. అలాగే జిల్లాల అధ్యక్షులు, సమన్వయకర్తల బాధ్యతలు చూసుకోవాలి. కానీ విజయసాయిరెడ్డి మనసు మాత్రం ఎక్కువగా విశాఖలోనే ఉంటోంది. ఆయన కూడా తరచూ అక్కడ పర్యటిస్తున్నారు. పని ఉంటే తాడేపల్లిలో లేకపోతే విశాఖలో అన్నట్లుగా ఉన్నారు.
విశాఖలో అభివృద్ధి పనులు కూడా తన చేతుల్లోనే ఉన్నాయన్నట్లుగా తాజాగా విశాఖలో పర్యటించి ప్రకటనలు చేశారు. మత్స్యకార కాలనీల్లో రిటైనింగ్ వాల్ కట్టిస్తున్నామని అవి అపోయిపోగానే మత్స్యకార దేవతల గుళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. అంతే కాదు.. ఎవరు అడ్డు వచ్చినా విశాఖనే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని ప్రకటించేశారు. ఎవరు అంటే.. న్యాయస్థానం అన్నమాట. కోర్టు అడ్డు వచ్చినా విశాఖనే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తామని ఆయన చెబుతున్నారు. ఎలాచేస్తారు.. ఏంచేస్తారన్నది మాత్రం చెప్పడం లేదు. అదో పొలిటికల్ స్ట్రాటజీ.
చేయగలిగే వాళ్లయితే ఈ పాటికి చేసి ఉండేవాళ్లని సెటైర్లు పడుతున్నా ఆయన మాత్రం తగ్గడం లేదు. ఉత్తరాంధ్ర ఇంచార్జ్ పదవి తీసేసినా ఇంకా విశాఖలో ఏం చేస్తున్నారన్న విమర్సలు సొంత పార్టీ నుంచి వినిపిస్తున్నా… ఆయన మాత్రం తగ్గడం లేదు. అక్కడ తిరుగుతున్న వారు అక్కడి రాజకీయాల్లో వేలు పెడితే వైసీపీలో మరో రచ్చ ప్రారంభం కావడం ఖాయమన్న వాదన వినిపిస్తోంది. ఇప్పుడు విశాఖ వైవీ సుబ్బారెడ్డి రాజ్యం. ఆయన ఊరుకుంటారా మరి !