సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ఈ మధ్య జనసేన పార్టీలో చేరారు. తన ఉద్యోగంలో భాగంగా ఎన్నో హై ప్రొఫైల్ కేసులను పరిశోధించిన జేడీ లక్ష్మీనారాయణ మీద నిజాయితీపరుడైన ఉద్యోగి గా పేరుంది. అయితే ఆయన ఓబుళాపురం మైనింగ్ కేసు, సత్యం రామలింగరాజు కేసు లాంటి ఎన్నో కేసులు డీల్ చేసినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వైయస్ జగన్ అక్రమ ఆస్తుల కేసు కారణంగా ఆయన మరింత పాపులర్ అయ్యారు. ఈ కేసు స్వయంగా డీల్ చేసిన లక్ష్మీ నారాయణకు సాంకేతిక వివరాలతో సహా ఈ కేసు గురించి క్షుణ్ణంగా తెలుసు. ఈ కేసును ఎవరికి భయపడకుండా, నిజాయితీగా పరిశోధన చేశారు. వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు ఆయన రాజకీయ అధికారం ద్వారా లబ్ధి పొందినవారు అందులో కొంత భాగాన్ని జగన్ సంస్థలలో పెట్టుబడులు గా పెట్టారు అన్నది జగన్ అక్రమాస్తుల కేసులో ప్రధాన ఆరోపణ. ఇలా చేయడాన్ని నేరపరిశోధక భాషలో క్విడ్ ప్రో కో అంటారు. మొత్తానికి లక్ష్మీ నారాయణ పరిశోధన కారణంగా జగన్ ఏ-1 ముద్దాయిగా, విజయ సాయి ఏ-2 ముద్దాయిగా జైలు కి కూడా వెళ్లాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన జేడీ లక్ష్మీనారాయణ తమకు ఏ విధంగా కౌంటర్ ఇస్తారా అని విజయసాయిరెడ్డి భయపడుతున్నట్టుగా కనిపిస్తోంది.
జనసేన పార్టీకి ఓట్లు లేవు, సీట్లు లేవు అని చెప్పుకునే వైఎస్ఆర్ సీపీ నేతలు, జేడీ లక్ష్మీనారాయణ జనసేనలో చేరిన మొదటి రోజు నుండి కంగారుపడుతున్నట్టు గా అర్థం అవుతోంది. జేడీ లక్ష్మీనారాయణ జనసేనలో చేరిన మొదటిరోజే విజయసాయిరెడ్డి లక్ష్మీనారాయణ ని ఉద్దేశించి ట్వీట్ చేశారు. “ఇప్పుడు జనసైనికుడిగా మారడమేమిటి లక్ష్మినారాయణ గారూ. మీరు మొదటి నుంచి చంద్రబాబు ఆదేశాల ప్రకారం నడుచుకునే జవానే గదా. పచ్చ పార్టీలో చేరితే ప్రజలు ఛీకొడతారని అనుబంధ సంస్థలో చేరారు. ఇన్నాళ్లు ఎవరి కోసం పనిచేసారో, ఇకపై ఏం చేస్తారో తెలియదనుకుంటే ఎలా?” అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేయగా నెటిజన్లు తమ కామెంట్లతో విజయసాయిరెడ్డి మీద విరుచుకు పడ్డారు. మీరు ఏ-2 ముద్దాయి కాబట్టి ఆయన ప్రత్యర్థి పార్టీలో చేరడాన్ని చూసి భయపడుతున్నట్టుగా మీ ట్వీట్ ఉందంటూ చాలామంది విజయసాయి రెడ్డికి కామెంట్ చేశారు.
అయితే విజయసాయి రెడ్డి మాత్రం తన పంథాను కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పుడు జనసేన పార్టీ తరఫున లక్ష్మీనారాయణకు విశాఖపట్నం ఎంపీ సీటు ఖరారు కావడంతో, టీడీపీ జనసేన మధ్య అవగాహన ఉందంటూ ఇది కూడా క్విడ్ ప్రో కో లో భాగమే అంటూ ట్వీట్ చేశారు. “నీకిది-నాకది థీరీని ( quid pro quo) కనిపెట్టిన వాడు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. అప్పట్లో కుల మీడియా ఈ థీరీని ఊరూవాడా ప్రచారం చేసింది. జేడీ జనసేనలో చేరిన వెంటనే ఆ థీరీని ఆచరణలోకి తెచ్చారు. నీకిది-నాకది అంటూ టీడీపీ-జనసేన మధ్య ఫ్రెండ్లీ పోటీకి డీల్ కుదిరింది. వారి ఉమ్మడి ప్రత్యర్ధి జగన్ గారే”, అంటూ విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ కు కూడా నెటిజన్ల నుంచి వ్యతిరేక స్పందన వస్తోంది. క్విడ్ ప్రో కో కు మీరు బాగా అలవాటు పడిపోయినందునే ప్రతిదీ మీకు క్విడ్ ప్రో కో లాగానే కనిపిస్తోంది అంటూ నెటిజన్లు విజయసాయిరెడ్డిని విమర్శిస్తున్నారు.
అయితే జేడీ లక్ష్మీనారాయణ ఇప్పటివరకు జగన్ మీద కానీ విజయసాయిరెడ్డి మీద కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అయినప్పటికీ విజయసాయిరెడ్డి పదే పదే జేడీ లక్ష్మినారాయణను టార్గెట్ చేస్తూ ట్వీట్ చేయడం, వ్యాఖ్యానించడం, జేడీ లక్ష్మీనారాయణకు, ఆయన ఉన్న జనసేన పార్టీకి, ఏదో ఒకలాగా తెలుగుదేశం పార్టీతో లంకె కలపడానికి ప్రయత్నించడం చూస్తుంటే విజయసాయిరెడ్డి నిజంగానే జేడీ లక్ష్మీనారాయణ ఏం మాట్లాడతాడా అని భయపడుతున్నట్టుగా ఉందని నెటిజన్లు భావిస్తున్నారు. విజయసాయి రెడ్డి బయట పడుతున్నాడు కానీ జగన్ బయట పడడం లేదు, జగన్ కి కూడా లక్ష్మీనారాయణ ఏం మాట్లాడతాడా అని ఒకింత ఆందోళన ఉండి ఉంటుంది అని నెటిజన్లు సెటైర్లు కూడా వేస్తున్నారు.