వైఎస్ వివేకా హత్య కేసులో నిందితులు .. అనుమానితులు.. సాక్షులు వరుసగా చనిపోతున్నారేమిటని మీడియా ప్రశ్నిస్తే విజయసాయిరెడ్డి ఇచ్చిన సమాధానం ” పుట్టిన వారు ఎప్పటికైనా గిట్టక తప్పదు కదా!” అని. ఆయన సమాధానం విని చాలా మంది ఆశ్చర్యపోయారు. వివేకా చనిపోయినప్పుడు గుండెపోటుతో చనిపోయాడని అందర్నీ తీవ్రంగా నమ్మించడానికి ప్రయత్నించిన మొదటి వ్యక్తి విజయసాయిరెడ్డి. తర్వాత ఆయనే మాట మార్చారు.
ఇప్పుడు రాహుల్ గాంధీని ఈడీ విచారించడంపై ఢిల్లీలో మీడియా అడిగిన ప్రశ్నలకూ ఇలాగే మెట్ట వేదాంతంతో సమాధానం ఇచ్చారు. ” కర్మఫలం అనుభవించాల్సిందేనని.. గతంలో చేసిన పాపాలకు అనుభవించాల్సిందే”నని చెప్పుకొచ్చారు. ఆయన ఉద్దేశం తమపై కాంగ్రెస్ కేసులు పెట్టించిందని కావొచ్చు కానీ.. ఇతరులు మాత్రం మరో రకంగా అనుకుంటున్నారు. వైఎస్ లాంటి వారిని ప్రోత్సహించి… విజయసాయిరెడ్డి లాంటి వారి ద్వారా అపరిమితంగా సంపాదించుకునే అవకాశం కల్పించి.. రాజకీయ ప్రయోజనాల కోసం చూసీ చూడకుండా ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి ఖర్మఫలం ఖచ్చితంగా అనుభవించాల్సిందేనని విజయసాయిరెడ్డి చెబుతున్నట్లుగా ఉందని అంటున్నారు.
విజయసాయిరెడ్డి కానీ.. వైసీపీ కానీ ఇప్పుడు అనుభవిస్తున్నదంతా కాంగ్రెస్ పార్టీదే. ఆ పార్టీయే లేకపోతే.. వాళ్లెవరూ ఉండేవారు కాదు. కానీ ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీని.. దారుణంగా విమర్శించడమే కాదు.. కించ పరుస్తున్నారు కూడా. అందుకే విజయాసాయిరెడ్డి లాంటి వారిని ప్రోత్సహించినందుకు నిజంగానే కర్మఫలమని కాంగ్రెస్ నేతలు కూడా అనుకుంటున్నారు.