రాష్ట్రంలో ప్రజాదరణ ఎలా ఉన్నా, నాయకులు వలసలు కొనసాగుతున్నా, అసెంబ్లీలో ఎల్పీ హోదాని కోల్పోయినా, వరుస ఓటములు చవిచూస్తున్నా, జరగాల్సి నష్టం జరుగుతున్నాగానీ కొంతమంది నాయకులు వారి అజెండాలు వారివే. వారి ఆధిపత్య పోరు వారిదే. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఈ పరిస్థితి ఎప్పట్నుంచో ఉన్నదే. అయితే, ఇప్పుడు మరో కొత్త కోణం కూడా ఉందా అనే అభిప్రాయం కలిగించేలా ఉన్నాయి… కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు!
ఆమె త్వరలో పార్టీ మారిపోతున్నారు, కమలం కండువా కప్పేసుకుంటారనే కథనాలు ఈ మధ్య చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలపై ఆమె స్పందిస్తూ… పార్టీ వదిలి వెళ్లాలంటే బహిరంగంగా ప్రకటించే వేరే పార్టీలోకి వెళ్తానని, అదేదో రహస్యంగా ఉంచాల్సిన అంశం కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకి వెళ్లగొట్టేందుకు కుట్ర జరుగుతోందని ఆమె సంచలన వ్యాఖ్య చేశారు. సొంత పార్టీవారే తనకు ప్రాధాన్యత తగ్గించే ప్రయత్నం చేస్తున్నారనీ, బయటకి పంపాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. భాజపాలోకి తాను వెళ్తున్నారంటూ వచ్చిన పుకార్లు గాంధీభవన్ నుంచి పుట్టాయన్నారు. కుట్ర అక్కడి నుంచే మొదలైందనీ, అక్కడున్న కొంతమంది ఇలాంటి వార్తలు పుట్టించి ప్రచారంలోకి తెచ్చారన్నారు. ఇదే అంశాన్ని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి దృష్టికి తీసుకెళ్లానని ఆమె అన్నారు. ప్రస్తుతం ఓ సినిమాలో నటిస్తున్న విజయశాంతి త్వరలోనే అమిత్ షాని కలవబోతున్నారంటూ కూడా వార్తలొచ్చాయి. అవేవీ వాస్తవాలు కాదని ఆమె ఖండించారు.
ఆమె పార్టీ మారకపోయినా… తాజాగా చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ కి కావాల్సిన మరింత డామేజ్ జరిగినట్టే! గాంధీభవన్ లో కొన్ని గ్రూపులున్నాయనీ… వారికి ఇష్టం లేని నేతల్ని సాగనంపేందుకు తాజా పరిస్థితుల్లో ఇలా కూడా చేస్తున్నారా అనే కోణం విజయశాంతి ఆరోపణల ద్వారా బయటపడింది. నిజానికి, ఎన్నికల సమయంలోనే విజయశాంతికి పార్టీ ప్రచార బాధ్యతలు ముందుండి నడిపించే అవకాశం ఇవ్వడంపై కూడా కొంతమంది నేతలు గుర్రుకున్న పరిస్థితి కనిపించింది. ఓటమి తరువాత ఆమె కూడా పార్టీ కార్యక్రమాలకి కొంత దూరంగా ఉంటూ వచ్చారు. అయితే, ఇప్పట్లో పార్టీ మారనని ఆమె ప్రకటించేశారు! కానీ, గాంధీభవన్ లోనే కుట్రలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించాక, ఇంకా అదే పార్టీలోనే ఆమె కొనసాగే అవకాశం ఉన్నట్టుగా భావించొచ్చా..?