టీ-కాంగ్రెస్, తెరాసకి మద్య జరుగుతున్న యుద్దంలో జానారెడ్డి విమర్శలకి ముఖ్యమంత్రి కెసిఆర్ జవాబు చెపుతూ, ఆనాడు మా ఎంపి విజయశాంతిని ఎమ్మెల్యే అరవింద్ రెడ్డిని మీ పార్టీలో చేర్చుకోలేదా? అప్పుడు మీకు తప్పుగా అనిపించలేదు కానీ ఇప్పుడు మీవాళ్ళు మా పార్టీలో చేరితే తప్పా? అని ప్రశ్నించారు. తెరాస నుంచి బయటకి వచ్చేసిన తరువాత విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరారు కానీ అక్కడా ఆమె తన ఉనికిని చాటుకోలేకపోయారు. ఆమె రాజకీయాలకి దూరంగా ఉండిపోవడంతో ఇన్నాళ్లుగా ఆమె ప్రస్తావనే రాలేదు. ఊహించని విధంగా సాక్ష్తా కెసిఆర్ నోటే ఆమె పేరు వినబడింది. కెసిఆర్ వ్యాఖ్యలపై ఆమె తక్షణమే స్పందించారు. తెరాస నన్ను 2013 జూన్ నెలలో పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఫిబ్రవరి 2014లో తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేస్తూ పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందింది. ఆ తరువాతే నేను కాంగ్రెస్ పార్టీలో చేరాను తప్ప కెసిఆర్ చెపుతున్నట్లుగా తెరాసని వీడి నేను కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. ఉద్యమ సమయంలో తెరాసలో మంచి గౌరవమే ఇచ్చేరు కానీ తెలంగాణా ఏర్పడిన తరువాత నా పట్ల తెరాస వైఖరిలో చాలా మార్పు వచ్చింది. నాపై లేనిపోని ఆరోపణలు చేసి పార్టీ నుంచి సస్పెండ్ చేశారు,” అని విజయ శాంతి అన్నారు.
ఆమె చెపుతున్న మాట వాస్తవమే. ఆమెని పార్టీ నుంచి సస్పెండ్ చేసి బయటకి గెంటేసిన తరువాత ఆమె ఏ పార్టీలో చేరినా అది తెరాసకి అనవసరమే. కానీ ఆమెని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం తప్పు అన్నట్లుగా కెసిఆర్ అనడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఏమైనప్పటికీ టీ-కాంగ్రెస్, తెరాస యుద్ధం మద్యలో ఆమె పేరు వినబడటంతో మళ్ళీ చాన్నాళ్ళ తరువాత ఆమెని ప్రజలు గుర్తు చేసుకొనే అవకాశం కలిగింది. రాజకీయాలలో ఎంతగా శ్రమించినప్పటికీ రాణించలేకపోవడంతో మళ్ళీ ఆమె సినిమాలలోకి రావాలని యోచిస్తున్నట్లు ఆ మద్యన వార్తలు వచ్చాయి. కానీ ఈ వయసులో ఆమె సినీ పరిశ్రమలో పోటీని తట్టుకొని నిలబడటం కూడా కష్టమే.