తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు కేంద్ర మంత్రి పదవి ఇచ్చి ఆయనను రాష్ట్ర రాజకీయాల నుంచి తప్పిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే అలాంటిదేమీ లేదని.. బండి సంజయ్ నేతృత్వంలోనే తాము ఎన్నికలకు వెళ్తామని రాములమ్మ విజయశాంతి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. నిజానికి నాయకత్వ మార్పు అనేది అంతర్గత అంశం. బీజేపీలో ఇలాంటివి పైకి మాట్లాడితే ఊరుకోరు. అయినా రాములమ్మ స్పందించాల్సి వచ్చింది. దీనికి కారణం.. ఇటీవల ఆమె రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను బండి సంజయ్ ను ఉద్దేశించి చేసినట్లుగా ప్రచారం కావడమే.
ఇటీవల టీ పీసీసీ చీఫ్ గా రేవంత్ సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఓ సందర్భంలో ఆయన తాను పదవి నుంచి వైదొలగడానికి సిద్ధమేనని ప్రకటించారు. దీనిపై రాములమ్మ స్పందించారు. కానీ కాంగ్రెస్ అంతర్గత విషయాలపై ఆమె ఎందుకు స్పందిస్తారని.. ఆమె తెలంగాణ పార్టీ అంశాలపైనే స్పందించారని.. ఆమె చేసిన వ్యాఖ్యలు బండి సంజయ్ కు ముడి పెట్టి ప్రచారం చేశారు. దీంతో రాములమ్మ ఉలిక్కి పడి వివరణ ఇచ్చింది. తాను బండి సంజయ్‌కు వ్యతిరేకం కాదని చెప్పుకొచ్చింది.
ఇటీవల బీజేపీ ఓ రేంజ్ లో హైప్ క్రియేట్ చేసుకున్నా… చాలా మంది నేతలు మాత్రం లూప్ లైన్ లో నే ఉండిపోయారు. తనకు ప్రాధాన్యత దక్కడం లేదని విజయ శాంతి కూడా ఫీలవుతున్నారు. దానికి కారణం బండి సంజయేనన్న అసంతృప్తి ఆమెకు ఉందంటున్నారు. అందుకే ఆమె మాటలను రివర్స్‌లో బండి సంజయ్ వ్యతిరేకులు వినియోగించుకున్నారని చెబుతున్నారు. కాంగ్రెస్ తరహాలోనే బీజేపీలోనూ అంతర్గత అసంతృప్తి ఎక్కువగా కనిపిస్తోంది. అది తరచూ వెల్లడవుతోంది.