తెలంగాణ బీజేపీలో పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉంది. ఎప్పుడూ చూసినా ఓ వర్గం అసంతృప్తితో మండిపోతూనే ఉంటోంది. కిషన్ రెడ్డిని చీఫ్గా చేసిన తర్వాత పరిస్థితి మారకపోగా.. మరింత దిగజారింది. ప్రతీ వారం కొంత మంది సీనియర్ నేతలు రహస్యంగా సమావేశం అవుతున్నారు. తాము కాంగ్రెస్లోకి వెళ్తామన్న సంకేతాలు మీడియాకు ఇస్తున్నారు. సీనియర్ నేతలతో పాటు పలువురు మాజీ ఎంపీలు కూడా అసంతృప్తితో ఉన్నారు.
విజయశాంతి తెలంగాణ లో బీజేపీ రాజకీయ ఆత్మహత్య చేసుకుందని సోషల్ మీడియాలో ప్రకటించారు. జకీయంగా పార్టీ ప్రయోజనాల హత్యలే ఉంటున్నప్పుడు, అవి కార్యకర్తలకు ఆత్మహత్యా సదృశ్యంగా గోచరిస్తున్నప్పుడు, కార్యకర్తలకు ఏమి దిశా నిర్దేశం చెయ్యాలో కూడా ఆ పై నేతలే చెప్పాలని డిమాండ్ చేశారు. విజయశాంతి ఇటీవల సోనియాను పొగడటం… కాంగ్రెస్ లో చేరుతారన్న ప్రచారం మధ్య తాజాగా చేసిన ఈ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
విజయశాంతి ప్రతి ఎలక్షన్ కు ఓ పార్టీ మారుతూంటారు. ఇప్పుడు ఆమెకు మరికొంత మంది జత కలిశారు. వేరే పార్టీల్లో ఓ వెలుగు వెలిగిన తాము ఏదో ఆశించి బీజేపీలో చేరితే కనీస గౌరవం కూడా దక్కట్లేదని వీరంతా సమావేశమవుతున్నారు. జాతీయ నాయకత్వం నుంచి కూడా భరోసా లభించని పక్షంలో వారంతా మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే యోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కూడా వారితో చర్చలు జరుపుతున్నారు.
పార్టీలో చేర్చుకున్నప్పుడు చెప్పిన మాటలకు.. ఇప్పుడు చేతలకు సంబంధం లేదని వారు మండిపడుతున్నారు. హైకమాండ్ అసలు తెలంగాణపై దృష్టి పెట్టడం లేదు. నేడో రోపో నోటిఫికేషన్ వస్తున్నా.. పట్టించుకునేవారు ఉండటం లేదు. త్వరగా తమ దారి తాము చూసుకోకపోతే నష్టపోతామని ఓ అంచనాకు వచ్చి కాంగ్రెస్ తో టచ్లోకి వెళ్తున్నారు.