హైదరాబాద్: లేడీ అమితాబ్, మెదక్ మాజీ ఎంపీ విజయశాంతి మళ్ళీ తెరపైకి వచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. మావోయిస్టుల ఎజెండాయే తమ ఎజెండా అని చెప్పుకుని అధికారంలోకొచ్చిన కేసీఆర్, అధికారాన్ని చేపట్టాక బూటకపు ఎన్కౌంటర్లకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ సాధించుకున్నా పరిస్థితిలో మార్పు రాలేదని అన్నారు. కేవలం రాజ్యం మారిందే తప్ప రాజ్యహింస ఆగలేదని మండిపడ్డారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఎక్కడికెళితే అక్కడకిక ఆయన వెంట తిరిగిన విజయశాంతి, మెదక్ లోక్ సభ స్థానాన్ని కేటాయించటానికి కేసీఆర్ నిరాకరించటంతో ఎన్నికలకుముందు టీఆర్ఎస్కు గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మెదక్ అసెంబ్లీ స్థానానికి పోటీచేసి పరాజయం పాలయ్యారు. ఈ మధ్య మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలోకి చేరటానికి మధ్యవర్తులద్వారా ప్రయత్నాలుకూడా చేశారు. అయితే కేసీఆర్ ఇష్టపడనట్లుంది. ఆ ప్రయత్నాలు ఫలించలేదు. నిన్న జరిగిన మావోయిస్ట్ ఎన్కౌంటర్ నేపథ్యంలో కేసీఆర్‌ను దుయ్యబడుతూ మళ్ళీ తెరపైకి వచ్చారు.