హైదరాబాద్: రాములమ్మ విజయశాంతి మళ్ళీ సొంతగూటికి చేరటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. టీఆర్ఎస్లో చేరికకోసం ఆమె సన్నిహితులు కేసీఆర్ను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కేసీఆర్ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని చెబుతున్నారు. విజయశాంతిలాగానే పార్టీని వీడిన మరికొందరు నేతలుకూడా ఆమెతోబాటు రీఎంట్రీకి ప్రయత్నిస్తున్నారని సమాచారం.
2009 పార్లమెంట్ ఎన్నికల్లో విజయశాంతికి మెదక్ సీటు ఇచ్చి కేసీఆర్ గెలిపించారు. తెలంగాణ రాష్ట్రసమితిలో ఎప్పుడూ కేసీఆర్ పక్కనే కనిపిస్తూ ఒక వెలుగు వెలిగిన విజయశాంతి, తెలంగాణ ఏర్పడిన తర్వాత పార్టీని వీడి కాంగ్రెస్లో చేరారు. ఆ పార్టీ తరపున మెదక్ లోక్సభ నియోజకవర్గానికి పోటీ చేసి ఓడిపోయారు. ఇక అప్పటినుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు.