ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా… ఎప్పుడో దశాబ్దాల క్రితం.. కరుణామయుడు అనే సినిమా చేసి… ఇప్పటికీ.. ఆ పేరు చెప్పుకుని.. బతికేస్తున్న విజయ్‌చందర్‌కు పదవి ప్రకటించేసింది ప్రభుత్వం. అందరూ.. నామినేటెడ్ పోస్టుల్లో.. జగన్ నమ్ముకున్న వారికి న్యాయం చేస్తున్నారన్న కోణంలోనే చూస్తున్నారు కానీ.. ఏపీలో.. చిత్ర పరిశ్రమ, టీవీ రంగం అభివృద్ధి సంగతేమిటన్న విషయాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు. విజయ్ చందర్ నియామకం.. ఆయన వ్యవహారశైలి.. ఇప్పటి వరకూ చూసిన వారికి.. ఇక ఏపీలో.. చిత్ర, టీవీ రంగ అభివృద్ధిపై ఆశలు వదిలేసుకోవచ్చంటున్నారు.
వైఎస్ కుటుంబ భజనల్లో విజయ్‌చందర్‌కు దశాబ్దాల అనుభవం …!
విజయ్‌చందర్.. సినిమాల్లో కన్నా… ఎక్కువగా.. వైసీపీ ఆఫీసు.. జగన్ ఇంటి దగ్గరే కనిపిస్తూంటారు. ఆయన వైఎస్ కుటుంబానికి భక్తుడు. జగన్ ఎక్కడ కార్యక్రమం పెట్టుకున్నా.. అక్కడ వాలిపోతారు. ఆయన పక్కన సాక్షి టీవీ కెమెరామెన్ కూడా ఉంటారు. వైఎస్ కుటుంబాన్ని అహా.. ఓహో అని పొగడటం తప్ప.. ఆయన ఇంకేమీ చేయరు. సినీ పరిశ్రమ అభివృద్ది గురించి ఆయనకు కనీస అవగాహన ఉందని కూడా ఎవరూ అనుకోరు. అయితే.. ఆయన కరుణామయుడు అనే సినిమాలో జీసస్ వేషం వేయడం.. క్రిస్టియానిటీని ప్రాణంగా భావించే వైఎస్ కుటుంబానికి నచ్చింది. అదే సమయంలో.. విజయ్ చందర్ కుటుంబానికి ఉన్న భూవివాదాలు.. ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణ సమయంలో.. తన భూములు పోకుండా… వైఎస్ సాయం చేశారన్న ప్రచారం ఉంది. అందుకే.. విజయ్ చందర్ కూడా.. ఈ విషయంలో.. ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. జగన్ కార్యక్రమాలు లేకపోతే.. బ్రదర్ అనిల్ ప్రోగ్రామ్స్ కి వెళ్లిపోతారు. అక్కడ.. పిచ్చి పిచ్చి పాటలకు.. డాన్సులు చేసి.. మత ప్రచారంలో సైడ్ క్యారెక్టర్ గా వ్యవహరిస్తూంటారు. ఆ విధేయతకు పదవి రూపంలో.. జగన్ ఫలితం ఇచ్చారు.
సినీ రంగాన్ని ఏపీలో ఎలా అభివృద్ధి చేస్తారో ఆలోచనలు శూన్యం..!
ఏపీలో సినీ పరిశ్రమకు ఇప్పుడు కనీసం పునాదుల్లేవ్. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ రంగం ఎలాగో…వినోద రంగం కూడా అలాగే అయిపోయింది. మొత్తం.. వ్యవస్థ.. హైదరాబాద్‌లో స్థిరపడిపోయింది. తెలుగుదేశం పార్టీ ఉన్న ఐదేళ్ల కాలంలో.. అతి కష్టం మీద.. కొంత మంది సినీ ప్రముఖుల్ని ఏపీలో పెట్టుబడులు పెట్టేలా ఆకర్షించగలిగారు. కానీ రాజకీయ అనిశ్చితి వారిని అటూఇటూ లాగింది చివరికి.. నాన్చి..నాన్చి.. ఏం జరుగుతుందని అనుకున్నారో అదే జరగడంతో ఇప్పుడు సైలెంటయిపోయారు. ఇప్పుడు వారికి భరోసా కల్పించి.. ఏపీలో .. వినోద రంగ.. నిర్మాణ వ్యవహారాల్ని పెంచాల్సిన సమయం వచ్చింది. కానీ.. విజయ్ చందర్ నియామకంతో ఆ ఆశలన్నీ అడియాశలయ్యాయని తెలుగు వినోద రంగ పరిశ్రమ అభిప్రాయంతో ఉంది.
ఏపీలో సినీ రంగ అభివృద్ధి ఇక కలే…!?
సాధారణంగా.. ఎఫ్డీసీ చైర్మన్ పదవిని.. ఇండస్ట్రీ సాధక బాధలన్నీ తెలిసిన వారికి ఇస్తారు. ఏపీ తొలి ఎఫ్డీసీ చైర్మన్‌గా.. అంబికా కృష్ణ వ్యవహరించారు. ఆయన పలు సినిమాలు నిర్మించారు. ఆయన తన అనుభవంతో.. ఏపీ ప్రభుత్వం నుంచి.. ఇండస్ట్రీకి పలు రకాల సహకారాలు అందించారు. కొన్ని స్టూడియోల ప్రతిపాదనలు కూడా వచ్చాయి. కానీ ఇప్పుడు.. విజయ్ చందర్ నియామకం తర్వాత అవన్నీ ముందుకెళ్తాయా.. లేదా అన్న సందేహం ఇండస్ట్రీ వర్గాల్లోనే ఉంది. కుటుంబానికి విధేయుడికి ఓ పదవి ఇవ్వడమే కానీ.. నిజంగా.. ఫిల్మ్ డెవలప్మెంట్ విషయంలో… ఏపీ సర్కార్‌కు అంత ఆసక్తి లేదన్న అభిప్రాయం మాత్రం.. ఈ నియామకంతో కలిగిందని.. ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది.