కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు ఏపీ ప్రభుత్వ వేధింపులే కారణమని… ఆయన కుమార్తె విజయలక్ష్మి హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజకీయ కక్షలతోనే.. గత మూడు నెలలుగా తండ్రి కోడెల, సోదరుడు శివరాంపై… తప్పుడు కేసులు పెట్టి వేధించారని…విజయలక్ష్మి ఫిర్యాదులో తెలిపింది. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును సీరియస్ గా దర్యాప్తు చేస్తున్నారు. కోడెల ఆత్మహత్య చేసుకున్న గదిని సీజ్ చేశారు. ఆయన వ్యక్తిగత ఫోన్ ను స్వాధీనం చేసుకుని కాల్ లిస్ట్ ను పరిశీలిస్తున్నారు. మరో వైపు ఈ కేసును… సీబీఐ లేదా… మరో ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థతో దర్యాప్తు చేయించాలన్న లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ ఉంది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందా అన్నదానిపై ఆసక్తి ఏర్పడింది.
పోస్టుమార్టం, ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం… కోడెల ఆత్మహత్య చేసుకున్నట్లుగా స్పష్టమయింది. దాంతో ఇప్పుడు.. ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలేమిటి..? బాధ్యులు ఎవరు అన్నదానిపై పోలీసులు విచారణ జరపాల్సి ఉంది. గత మూడు నెలలుగా కోడెల తీవ్రమైన మానసిక క్షోభకు గురవుతున్నారని .. కోడెల కుమార్తె విజయలక్ష్మి … సోమవారం.. మీడియా సమావేశంలో కన్నీరు పెట్టుకుంటూ చెప్పారు. ఈ మానసిక క్షోభకు కారణం ఏమిటి..? కారకులెవరన్నది తేలాల్సి ఉందని టీడీపీ నేతలంటున్నారు. గత మూడు నెలల్లోనే ఆయనపై పందొమ్మిది కేసులు పెట్టడం, జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి మీడియాలో… కోడెలపై వచ్చిన అసత్యకథనాలు, ప్రతీ విషయానికి ఆయనతో లింక్ పెట్టడం..తదితర అంశాలన్నింటినీ టీడీపీ నేతలు ఇప్పటికే పోలీసుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు.
అయితే.. కేసును లైట్ తీసుకోవాలా.. సీరియస్ గా విచారణ చేయాలా అన్నది… తెలంగాణ పోలీసుల మీదే ఆధారపడి ఉంది. తెలంగాణ పోలీసులపై నమ్మకం లేకపోతే.. కోడెల కుటుంబసభ్యులు సీబీఐ విచారణ కోసం కోర్టుకెళ్లే అవకాశం ఉంది.