అప్పుల అప్పారావు సినిమాలో ఓ సీన్ ఉంటుంది..! ఏ అప్పారావు కావాలండి అని.. ఓ వ్యక్తి అడిగితే.. ఏ అప్పారావు అండి.. మరో వ్యక్తికి డౌట్ వస్తుంది..! … చివరికి అప్పుల అప్పారావు వచ్చి.. ఏ అంటే.. అప్పుల.. తానే మీరడుగుతున్న అప్పారావు అని చెప్పే వరకూ వారిద్దరూ పోట్లాడుకుంటూనే ఉంటారు. ఇప్పుడు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల పుణ్యమా అని.. ఆంధ్రప్రదేశ్ రాజధానికి కూడా అదే పరిస్థితి వచ్చింది. చివరికి వైసీపీ నేతలకూ అదే అనుభవం ఎదురవుతోంది.
రాజధానికి రూ. 50వేల కోట్ల ఖర్చవుతుందన్న విజయసాయి..!
రాజధానికి రూ. 47వేల కోట్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాం..! .. ఇదీ ఆల్ పార్టీ మీటింగ్ తర్వాత విజయసాయిరెడ్డి మీడియాకు చెప్పినమాట. ఏ రాజధానికి…?… ఇది మీడియా ప్రతినిధుల నుంచి డైరక్ట్ గా వచ్చిన క్వశ్చన్. దీనికి విజయసాయిరెడ్డి వద్ద కూడా సమాధానం లేకపోయింది. ఏం చెప్పాలో తెలియక నీళ్లు నమిలారు. తర్వాత కవర్ చేసుకునేందుకు తంటాలు పడ్డారు. రాజధాని ఎక్కడో చెప్పాల్సిన పని లేదు. కానీ.. రాజధాని ఏర్పాటు కోసం.. నిధులు మాత్రం కేంద్రాన్ని అడిగామన్నారు. రాజధాని నిర్మాణానికి మొత్తం రూ. 49, 924 కోట్లు అవుతాయని.. ఇందులో ఇప్పటికి కేంద్రం రూ. 2500 కోట్లు ఇచ్చింది కాబట్టి.. మిగిలినవి ఇవ్వాలని సాయిరెడ్డి అంటున్నారు.
ఏ రాజధానిలో ఖర్చు చేస్తారో చెప్పలేకపోయిన విజయసాయి..!
ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అనే దానిపై.. సర్కార్ తీరు.. ఢిల్లీ స్థాయిలో నవ్వుల పాలవుతోంది. మీడియా ప్రతినిధులు కూడా.. వైసీపీ నేతల్ని సందర్భం వచ్చినప్పుడల్లా.. రాజధాని ఏది..? అనే ప్రశ్న వేస్తున్నారు. ఇప్పుడు.. విజయసాయిరెడ్డికి ఆ పరిస్థితి ఎదురయింది. మూడు రాజధానుల పేరుతో… దేశంలో ఏ రాష్ట్రంలో లేని సరికొత్త గందరగోళాన్ని ఏపీలో సృష్టించిన పాలకులు.. ఆ నిర్ణయం నవ్వుల పాలవుతున్నా… వెనక్కి తగ్గడం లేదు. అసలు రాజధానిపైనే ప్రభుత్వానికి స్పష్టత లేనప్పుడు… దాదాపుగా రూ. యాభై వేల కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని అభ్యర్థించడం.. మరో వింత అని.. ఇలాంటివి చేయడంలో విజయసాయిరెడ్డి సిద్ధహస్తుడన్న విమర్శలు టీడీపీ వర్గాల నుంచి వస్తున్నాయి.
రాజధాని ఎక్కడో చెప్పలేకపోతే కేంద్రం నిధులిస్తుందా..?
కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలంటే… ఓ స్పష్టమైన మార్గదర్శకాల ప్రకారం విడుదల చేస్తుంది. ఆ నిధులు ఏం చేస్తున్నారో.. ఎక్కడ ఖర్చు పెడుతున్నారో స్పష్టమైన నివేదికలు ఉంటేనే ఇస్తుంది. మీరు డబ్బులు ఇవ్వండి.. మా ఇష్టం వచ్చిన దగ్గర ఖర్చు పెట్టుకుంటామంటే.. కేంద్రం.. అడిగినంతనే ఇచ్చేయదు. విభజన చట్టంలో రాజధాని నిర్మాణ బాధ్యత కేంద్రానిది అని ఉంది. దీన్ని చూపించి గత ప్రభుత్వం… కేంద్రంపై ఒత్తిడి తెచ్చింది. అమరావతి నిర్మాణానికి సాయం చేయాలని డిమాండ్ చేస్తూ వచ్చేది. ఇప్పుడు ప్రభుత్వం.. అసలు రాజధాని ఏదో చెప్పకుండా… నిధులు అడుగుతోంది. దాంతో.. కేంద్రం.. ఆ ప్రతిపాదనను పట్టించుకోవాల్సిన అవసరం లేదనే భావనకు వచ్చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు.