వైసీపీ నేతలు ఏం చేసినా దాని వెనుక ఓ స్కాం ఉంటుందటే అతిశయోక్తి కాదు. తాజాగా విశాఖలో మోదీ పర్యటనను కూడా వారు అందుకే వాడుకుంటున్నారు. ఏయూలో ఉన్న ఇరవై ఎకరాల స్థలంపై కన్నేశారని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. అందులో మంచి గ్రీనరీ.. దశాబ్దాల వయసున్న చెట్లు ఉండేవి. అయితే వాటన్నింటినీ ఇప్పుడు నరికేశారు. గతంలోనే అసాంఘిక కార్యక్రమాల పేరుతో సగం నరికేశారు. తీవ్రమైన విమర్శలు రావడంతో ఆపారు. ఇప్పుడు మోదీ బహిరంగసభను మిగిలిన చెట్లు ఉన్న చోట్ల నిర్వహిస్తామని చెప్పి.. ఆ ఉన్న చెట్లను నరికేస్తున్నారు. అంటే.. ఏయూ మొత్తాన్ని “గ్రీన్ షేవ్ ” చేస్తున్నారన్నమాట.
అసలు ఏయూ లో మోదీ బహిరంగసభ నిర్వహించడానికి చెట్లు ఎందుకు కొట్టేయాలి.. కొట్టేయకుండా ఉన్న స్థలంలో ఎందుకు నిర్వహించకూడదు అంటే.. గతంలోచాలా చేశారు గా అంటే మాత్రం వైసీపీ నాయకులకు కోపాలు వచ్చేస్తాయి. చెట్లు కొట్టి గ్రీన్ షేవ్ చేసిన చోట మాత్రమే సభ నిర్వహించాలని విజయసాయిరెడ్డి డిసైడయ్యారు. అధికారులను వెంటేసుకుని సభా ప్రాంగణాన్ని ఆయన పరిశీలించారు. ఆ మేరకు ఖరారు చేశారు . ఇప్పుడు చెట్లు కొట్టేయడం ప్రారంభించారు.
అసలు ఏయూలో ఉన్న గ్రీనరీ మొత్తాన్ని తొలగించడానికి విజయసాయిరెడ్డి ఎందుకు అంత ఉత్సాహ పడుతున్నారన్నది కీలకం. ఆ భూములపై కూడా కన్నేశారన్న చర్చ జరుగుతోంది. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కోసం అక్కడ ఏదైనా నిర్మాణాలు చేపట్టాలన్న ఆలోచనలో ఉన్నారని అందుకే ఇలా చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. అదీ కాకపోతే ఇంకేమైనా ప్రణాళిక ఉందేమో కానీ బయటపడే వరకూ తెలియదు. కానీ వైసీపీ ఆఫీసులో ఏయూను మార్చేసిన వీసీ.. దేనికీ అభ్యంతర పెట్టరు కాబట్టి… మొత్తానికి ఏయూ భూములకు మూడినట్లేనని విశాఖ వాసులు ఓ నిర్ణయానికి వస్తున్నారు.