పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్లు, పోలవరం రివర్స్ టెండర్ల విషయంలో.. తమపై పడిన మరకల్ని .. వైసీపీ పెద్దలు నేరుగా ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షాలకు అంటించే ప్రయత్నం చేస్తున్నారు. పీపీఏల సమీక్ష అయినా… పోలవరం రివర్స్ టెండర్లు అయినా… అన్నింటినీ తాము.. కేంద్రానికే చెప్పి చేస్తున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త పాట అందుకుంది. తాము ప్రతి నిర్ణయాన్ని… ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు చెబుతున్నామని.. వారి అంగీకారం మేరకే.. పీపీఏల రద్దు, పోలవరం రివర్స్ టెండర్లపై ముందుకెళ్తున్నామని… విజయసాయిరెడ్డి ఢిల్లీలో నేరుగా ప్రకటించారు. తమ నిర్ణయాల ప్రభావం… పరిణామాలు కేంద్రానికి అంటించే ప్రయత్నాన్ని ఏ మాత్రం మొహమాటం లేకుండా చేశారు.
పీపీఏల సమీక్ష వద్దని కేంద్రం పదే పదే లేఖలు పంపింది. పోలవరం రివర్స్ టెండర్లు వద్దని కూడా..పోలవరం పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ అంత కంటే గట్టిగానే చెప్పింది. అయినా ఏపీ సర్కార్… కేంద్రాన్ని లెక్కలోకి తీసుకోనట్లుగా నిర్ణయాలు ప్రకటిస్తూనే ఉంది. ఆర్థిక వ్యవస్థపైనే కాదు… పెట్టుబడుల వాతావరణంపై..ప్రభావం పడే నిర్ణయాలు తీసుకున్నారు. వీటిని కేంద్రం కూడా ప్రశ్నించింది. తమ దేశాలకు చెందిన పెట్టుబడి సంస్థల కోసం… హెచ్చరికలతో కూడిన లేఖలు పలు దేశాల నుంచి కేంద్రానికి..రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అందాయి. అయినా రాష్ట్ర ప్రభుత్వం లెక్క చేయలేదు. వివాదాస్పద నిర్ణయాలన్నింటికీ.. మోదీ, షా పర్మిషన్ ఉందని చెప్పడం ద్వారా.. విజయసాయిరెడ్డి… బీజేపీ అగ్రనేతలతో తనకు ఉన్న సాన్నిహిత్యాన్ని అడ్వాంటేజ్ గా తీసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది.
నిజంగా విజయసాయిరెడ్డి … పీపీఏల రద్దు, పోలవరం రివర్స్ టెండర్ల కోసం…మోడీ , షాల నుంచి పర్మిషన్ తీసుకుని ఉంటే.. కేంద్రం నుంచి ఎట్టి పరిస్థితుల్లో హెచ్చరికలతో కూడిన లేఖలు వచ్చి ఉండేవే కావు. కానీ విజయసాయిరెడ్డి మాత్రం.. ఆ నిర్ణయాలన్ని .. మోదీ, షాల చలువేనన్నట్లుగా.. ప్రచారం ప్రారంభించేసారు. దేశంలో పెట్టుబడుల వాతావరణం దెబ్బతినకూడదని… కేంద్రం పట్టుదలతో ఉంది. ఇలాంటి సమయంలో.. పీపీఏల సమీక్షకు.. పోలవరం రివర్స్ టెండర్లకు.. మోదీ , షా అనుమతి ఇచ్చే అవకాశం లేదని బీజేపీ వర్గాలు కూడా చెబుతున్నాయి. తమపై పడిన మరకను..నేరుగా… మోడీ, షాలకు … అంటించే ప్రయత్నాన్ని విజయసాయిరెడ్డి చేయడం ఇప్పుడు ఢిల్లీలో కలకలం రేపుతోంది.