అధికారాన్ని అడ్డం పెట్టుకుని కాకినాడ పోర్టును కొట్టేసిన కేసులో విజయసాయిరెడ్డి సీఐడీ విచారణకు హాజరయ్యారు. రెండు రోజుల కిందట సీఐడీ అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఈ విషయాన్ని కూడా గుంభనంగా ఉంచిన ఆయన ఎప్పటిలా వేధింపులని.. మరొకటని అనకుండా నేరుగా విచారణకు హాజరయ్యారు.
కాకినాడపోర్టును కొట్టేయడానికి చాలా పెద్ద ప్లాన్ వేశారు. ఆ ప్లాన్ లో విజయసాయిరెడ్డి కీలక పాత్రధారి. ఆయన అల్లుడి సోదరుడికే పోర్టు బదలాయింపు జరిగింది. పేరుకే ఇది అరబిందోనని జగన్ రెడ్డి బినామీదన్న ప్రచారం ఉంది. ఈ క్రమంలో అసలు ఈ డీల్ వెనుక ఏం జరిగిందో విజయసాయిరెడ్డి చెబుతారన్న ప్రచారం జరుగుతోంది. తనకు ఈ డీల్ తో అసలు సంబంధంలేదని కేవీ రావును తాను ఎప్పుడూ చూడలేదని విజయసాయిరెడ్డి చెబుతున్నారు.
విజయసాయిరెడ్డిపై సీఐడీ పోర్టు కేసు నమోదు చేసినప్పుడు ఆయన చిందులు తొక్కారు. చంద్రబాబు ప్రాణాలతో ఎలా ఉంటాడో చూస్తామన్నట్లుగా మాట్లాడారు. లుకౌట్ నోటీసులు జారీ చేశారు కాబట్టి అంతు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. కానీ ఈడీ అధికారులు ఇదే కేసులో పిలిచి ప్రశ్నించిన తర్వాత ఆయన అసలు రాజకీయాల నుంచే విరమించుకున్నారు. ఆ తర్వాత చంద్రబాబుతో వ్యక్తిగత గొడవలు లేవని చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి సీఐడీ విచారణలో చెప్పే అంశాలు కీలకంగా మారనున్నాయి.