ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ఎక్కడ నిర్మించాలి అనే అంశం నుంచి రాజధాని నిర్మాణం వరకు ప్రతీ అంశం చాలా వివాదాస్పదం అవుతూనే ఉండటం చాలా దురదృష్టకరం. అందుకు వైకాపాయే కారణమని తెదేపా నేతలు ఆరోపిస్తుంటే, తాము రాజధాని నిర్మాణాన్ని వ్యతిరేకించడం లేదని దాని కోసం ప్రభుత్వం తీసుకొంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలని, ఇమిడి ఉన్న అవినీతిని మాత్రమే వ్యతిరేకిస్తున్నామని వైకాపా వాదిస్తోంది. నేటికీ ఆ రెండు పార్టీలు నిరంతరంగా విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకొంటూనే ఉన్నాయి. వారి ఈ వాదోపవాదాల వలన అమరావతి నిర్మాణ పనులు ఇంకా మొదలవకముందే దానికి చాలా చెడ్డ పేరు ఏర్పడుతోందని వారు మరిచిపోతున్నారు.
వైకాపా ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి అమరావతి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, “ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిని ప్రజారాజధానిగా తీర్చిదిద్దుతానని చెపుతుంటారు. కానీ ఆయన తీరు చూస్తుంటే దానిని ఒక పెద్ద వ్యాపార కేంద్రంగా నిర్మించాలని ప్రయత్నిస్తున్నట్లుంది. సామాన్యప్రజలు సైతం సుఖసంతోషాలతో నివసించే విధంగా అమరావతిని నిర్మించాలి,” అని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ నిర్మించాలి? అది ఏవిధంగా ఉండాలి? అనే విషయంపై గత యూపియే ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ కోసం నిపుణులతో కూడిన శివరామ కృష్ణన్ కమిటీని ఏర్పాటు చేస్తే, వారు రాష్ట్రమంతటా విస్తృతంగా పర్యటించి, ప్రజాభిప్రాయాన్ని సేకరించి నివేదిక ఇచ్చారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరో ఆలోచన చేయకుండా దానిని చెత్తబుట్టలో పడేశారు. అప్పటి నుంచి రాజధానికి సంబంధించి అన్నీ ఏకపక్ష నిర్ణయాలే తీసుకోవడం అందరూ చూస్తూనే ఉన్నారు.
అమరావతిని ప్రజారాజధానిగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి స్వయంగా చెప్పారు. దాని నిర్మాణంలో రాష్ట్ర ప్రజలు అందరూ భాగస్వాములు కావాలని చెప్పి ప్రజల వద్దనుంచి విరాళాలు సేకరించారు. రాష్ట్రం నలుమూలల నుంచి నీళ్ళు, మట్టి తెప్పించి అమరావతిలో చల్లారు. అమరావతిలో ప్రజాభాగస్వామ్యం అక్కడికే పరిమితం చేశారు. ఆ తరువాత రాజధాని ఎక్కడ నిర్మించాలి? ఏవిధంగా నిర్మించాలి? ఎవరు నిర్మించాలి? దాని రూపురేఖలు ఏవిధంగా ఉండాలి? దానికి ఏ పేరు పెట్టాలి? వంటి విషయాలలో ఆయన కనీసం ప్రతిపక్షాలని కూడా పరిగణనలోకి తీసుకోలేదు. అన్నీ ఏకపక్ష నిర్ణయాలే తీసుకొంటుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. ప్రభుత్వ తీరు చూస్తుంటే అమరావతితో రాష్ట్ర ప్రజలకి, ప్రతిపక్షాలకి అసలు సంబంధమే లేదు..ఉండదు అన్నట్లుగా వ్యవహరిస్తోందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నా అది ఏమాత్రం పట్టించుకోవడం లేదు. రాజధాని నిర్మాణపనులు ఇంకా మొదలుకాక మునుపే పెద్ద పెద్ద వ్యాపార, పారిశ్రామిక సంస్థలకి రాజధానిలో స్థలాలు కేటాయిస్తుండటంతో ప్రజలలో కూడా అదే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఒకప్పుడు హైదరాబాద్ లో హైటెక్ సిటీ, సైబరాబాద్ వంటివి నిర్మించి హైదరాబాద్ నగరాన్ని రాష్ట్రానికి ప్రధాన ఆదాయవనరుగా మార్చినట్లుగానే, అమరావతిని కూడా ఆంధ్రప్రదేశ్ కి ప్రధాన ఆదాయవనరులు సృష్టించే విధంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నట్లు స్పష్టమవుతూనే ఉంది. అయితే అమరావతిలో సంపన్నులే తప్ప సామాన్యులు ఎవరూ జీవించలేని పరిస్థితులు కల్పిస్తే అది ప్రజారాజదాని అనిపించుకోదు. డిల్లీ, ముంబై, కోల్ కతా, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాలన్నీ ఎంతగా అభివృద్ధి చెందినప్పటికీ అక్కడ సామాన్య ప్రజలు కూడా జీవించగలిగే అవకాశం ఉంది కనుకనే అవన్నీ జీవకళతో ఉట్టిపడుతుంటాయి. అమరావతిని కూడా ఆవిధంగానే అభివృద్ధి చేయాలి తప్ప సంపన్నుల రాజధానిగా మార్చితే దాని వలన జిల్లాల మద్య, ప్రజల మద్య సమతుల్యం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.