వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి ఇంకా ఎన్నికల మూడ్ లోనే ఉన్నట్టున్నారు. ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేస్తే, అది వైకాపాకి అనుకూలంగా మారుతుందనో, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉంటుందనో భావిస్తున్నట్టున్నారు. ఇప్పటికీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని లక్ష్యంగా చేసుకుని విమర్శలు కొనసాగిస్తున్నారు. అది కూడా వ్యక్తిగత విమర్శలు చేస్తుండటం గమనార్హం.
ట్విట్టర్ లో స్పందించిన విజయసాయిరెడ్డి… ఎన్నికల కమిషన్ లో సంస్కరణలు తెస్తానని చంద్రబాబు అంటున్నారని ఎద్దేవా చేశారు. ఛీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని కోవర్టు అంటూ విమర్శించడం ఏంటని తప్పుబట్టారు. ప్రజలు ఉమ్మేసినా తుడిచేసుకుని మరీ, ఈసీ మీద పడ్డారని విమర్శించారు. మైండ్ కంట్రోల్ తప్పి ఏదేదో మాట్లాడుతున్నాడు, నాటకాలు కట్టిపెట్టి, ఓట్ల లెక్కింపు దాకా మానసిక చికిత్స తీసుకో అంటూ ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి.
ఎన్నికల్లో ఈవీఎంలు మొరాయించాయి. ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం ప్రజలు నానా కష్టాలుపడ్డారు. గంటల తరబడి ఎండల్లో నిలబడ్డారు. నిర్వహణలో ఎన్నికల సంఘం వైఫల్యం ఎక్కడికక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ఇదంతా ఆయనకి కనిపించదా..? ఎంతసేపూ విమర్శలేనా..? ఛీఫ్ సెక్రటరీ మీద కోవర్టు అని వ్యాఖ్యానించారని చంద్రబాబు మీద మండిపడ్డారే… మరి, ఏపీ డీజీపీతో సహా పోలీస్ యంత్రాంగమంతా టీడీపీ జెండా మోస్తున్నారని నిన్నటి వరకూ ఆయన విమర్శించారు కదా. అప్పుడు మరి తప్పు అనిపించలేదా..? ఆ క్షణంలో తాము ఆరోపణలు చేస్తున్నది ఉన్నతాధికారులపై అని గుర్తురాలేదా..? ప్రజల తీర్పు ఈవీఎంలలో ఉంది. అది బయటపడే వరకూ కాస్త అదుపులో ఉంటే తప్పేముంది..?