లోకేష్ రెడ్‌బుక్ చూపిస్తున్నారని భయపడిపోయి ఆయనను అరెస్టు చేస్తామని సీఐడీ కోర్టుకు వెళ్లింది. ఒక్క సీఐడీనే కాదు.. విజయసాయిరెడ్డి కూడా రెడ్ బుక్ జపం చేస్తున్నారు. విచిత్రంగా ఎన్నికల సంఘానికీ ఫిర్యాదు చేశారు. లోకేష్ రెడ్ బుక్ చూపిస్తున్న ఫోటోను తీసుకు వచ్చి మరీ ఫిర్యాదు చేశారు. తాను ఇలా కంప్లైంట్ చేశానని మీడియాకు చెప్పారు. తప్పు చేసిన అధికారులను వదిలేది లేదని లోకేష్ హెచ్చరిస్తూంటే..దానికి ఈసీ ఏం చేస్తుందన్నదానిపై విజయసాయిరెడ్డికి స్పష్టత ఉందోలేదో కానీ.. ఆ రెండు బుక్ చూసి భయపడుతున్నారన్న వాదనకు మాత్రం బలం చేకూరింది.
తప్పుడు పనులు చేసి.. చట్టాలను ఉల్లంఘించి టీడీపీనేతలను వేధించిన ఏ ఒక్కరినీ వదిలేది లేదని లోకేష్ చెబుతున్నారు. అయితే కొంత మంది భుజాలు తడుముకుంటూ.. మమ్మల్నే అంటున్నాడని తెర ముందుకు వచ్చేస్తున్నారు. నిజానికి ఏపీలో పిడికెడు మంది తప్పుడు అధికారులు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ప్రభుత్వం మారితే వారి పరిస్థితి ఏమిటన్నది నిజాయితీగా పని చేసిన అధికారుల్లో చర్చ జరుగుతూనే ఉంది. తప్పుడు పనులు చేసిన వారిని ఇలాంటి ఫిర్యాదులు కాపాడలేవన్న వాదన కూడా వినిపిస్తోంది. ఈసీని కలిసిన విజయసాయిరెడ్డి విచిత్రమైన ఫిర్యాదులు చేశారు. అసలు బోగస్ ఓట్లు లేవని.. బోగస్ ఓట్లు ఉన్నాయని ఫిర్యాదు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని రివర్స్ లో డిమాండ్ చేశారు. అంతేనా అసలు పవన్ కల్యాణ్ పార్టకి గుర్తింపు లేదని ఆయనకు ఎందుకు అపాయింట్ మెంట్ ఇచ్చారని కూడా ప్రశ్నించారట.
టీడీపీ అలయన్స్ పార్టీ కాబట్టి ఇచ్చామని ఈసీ అధికారులు చెబితే అలా ఇవ్వకూడదని రెచ్చిపోయారట. జనసేన గుర్తుగా గాజు గ్లాస్ ఇవ్వకూడదని కూడా ఫిర్యాదు చేశారు. చదవేస్తే ఉన్న మతి పోయిందన్నట్లుగా.. విజయసాయిరెడ్డికి అధికారం పోతుందని తెలియగానే మందబుద్ది వచ్చేస్తోందని.. ఎవరి దగ్గర ఎలాంటి ఫిర్యాదులు ఇవ్వాలో కూడా తెలియనట్లుగా వ్యవహరిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి.