వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శల దూకుడును కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మీద, గత ప్రభుత్వ పాలన మీదా ఇంకా విమర్శలు విసురుతూనే ఉన్నారు. తాజాగా వరుసగా కొన్ని ట్వీట్లు చేస్తూ… పోలవరం, అన్న కేంటీన్లు వంటి అంశాలపై ఆయన స్పందించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేద్దామనే సదుద్దేశం గత సీఎం చంద్రబాబు నాయుడుకి ఎప్పుడూ లేదనీ, అందినంత దోచుకునే ప్రయత్నమే చేశారని ఆరోపించారు. ఇప్పటికే ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి ఉంటే, జలసిరితో కళకళలాడుతూ ఉండేదన్నారు. దాదాపు 70 టీఎంసీల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోయేవి కాదన్నారు.
అన్న కేంటీన్లపై స్పందిస్తూ… ఎన్నికల ముందు ప్రజలను మభ్యపెట్టేందుకే వీటిని చంద్రబాబు ప్రారంభించారన్నారు. అన్న కేంటీన్ల పేరుతో రూ. 150 కోట్ల స్కామ్ జరిగిందన్నారు. పేదలకు భోజనం పెట్టే పథకాల్లో కూడా సొమ్ము దోచుకున్నారంటూ విజయసాయి ఆరోపించారు. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు.. సీఎం జగన్ మీద చేసిన వ్యాఖ్యలపై కూడా ట్విట్టర్లో విజయసాయి స్పందించారు. ఎన్టీఆర్ వెన్నుపోటు సమయంలో జరిగిన కుట్రలో యనమల భాగస్వామనీ, ఆయన విలువల గురించి మాట్లాడటమేంటని ఎద్దేవా చేశారు. చిదంబరం కాళ్లు పట్టుకుని జగన్ మీద తప్పుడు కేసులు పెట్టించింది మీ బాసే కదా అన్నారు. మీ నాయకుడు, ఆయన కొడుకూ ఏ జైల్లో ఉంటారో? మిలాత్ లో కలుద్దురు, సిద్ధంగా ఉండండి అంటూ ఘాటుగా స్పందించారు!
పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరిగి ఉంటే ప్రభుత్వం తరఫున చర్యలుండాలి. అంతేగానీ, ఇంకా ఆరోపణలు చేస్తూ ఉంటే ఏం లాభం? ఇంకోటి.. పోలవరం ఇప్పటికే పూర్తయి ఉంటే కచ్చితంగా బాగానే ఉండేది, కానీ గత భాజపా సర్కారు పోలవరం పనులు జరుగుతున్న సమయంలో ఎన్ని కొర్రీలు పెట్టిందో అందరికీ గుర్తుంది. అదేదో, గత రాష్ట్ర ప్రభుత్వమే అడ్డుకున్నట్టుగా విజయసాయి వ్యాఖ్యానిస్తున్నారు. ఇంకోటి, అన్న కేంటీన్లలో అవినీతి ఉంటే… కచ్చితంగా వెలికి తీసి, బాధ్యులకు శిక్షలు పడాల్సిందే. అలాందేదో జరిగిందో లేదో నిజం తేలకుండానే, ఏదో జరిగిపోయినట్టు విజయసాయి విమర్శలు చేస్తున్నారు. మొత్తానికి, విజయసాయి రెడ్డి ఇంకా అదే పాత ధోరణిలో ట్వీట్లు పెడుతున్నారు. ఎన్నికలైపోయి అధికారంలోకి వచ్చినా కూడా… వెన్నుపోటు దారనీ, జైలు వెళ్తారంటూ ఈ తరహా విమర్శలు చేయడం వల్ల ఉపయోగం ఏదైనా ఉంటుందా..?