తాజాగా మరో లేఖ రాశారు వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి! ఈసారి ఆయన ఎంచుకున్న అంశం… సమాచార కమిషనర్ల నియామకాలు, ఆ ప్రక్రియలో పాటించాల్సిన మార్గదర్శకాలు. ఈ మేరకు సీఎస్ కి లేఖ రాశారు. రాష్ట్ర సమాచార కమిషనరుగా రాజా నియామక ప్రతిపాదన గురించి ఆయన తెలిసిందని లేఖ మొదలుపెట్టారు. కమిషనర్లుగా ఇద్దరు పేర్లను ప్రతిపాదించినట్టుగా విశ్వసనీయంగా తెలిసిందన్నారు విజయసాయి. ఈ ఇద్దరూ టీడీపీ కార్యకర్తలనీ, అలాంటివారికి ఎలా పదవుల్ని కట్టబెడతారన్నారు. కమిషనర్లుగా నియమితులయ్యేవారు ఏ పార్టీకీ చెందని వ్యక్తులై ఉండాలనీ, ప్రజా జీవితంలో ప్రముఖులై ఉండాలనీ, ప్రభుత్వ పాలనపై అవగాహన ఉండాలనీ… ఇలా నియామక అర్హతలను గుర్తు చేసే ప్రయత్నం చేశారు.
ప్రభుత్వం ప్రతిపాదించిన పంపిన ఇద్దరి పేర్లలో ఒక పేరును ఇప్పటికే గవర్నర్ ఓకే చేశారని కూడా తనకు తెలిసిందన్నారు. అది కూడా ప్రతిపక్ష నాయకుడు ఎన్నికల ప్రచారంలో ఉండగానే దీనికి సంబంధించిన లేఖ ప్రిపేర్ అయిపోయిందన్నారు. నిబంధనలు స్పష్టంగా ఉన్నా, వాటిని పాటించకుండా ప్రభుత్వం ఎలా ఈ ప్రతిపాదనను తీసుకొస్తుందని ఆ లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు, గవర్నర్ కూడా దీన్ని ఏ పరిస్థితుల్లో ఓకే చేశారో అర్థం కావడం లేదన్నారు. ఆర్టీఐ కమిషనర్ల నియామకం విషయంలో నాలుగేళ్లు ఎదురు చూసిన ప్రభుత్వానికి, ఇప్పుడు తొందరపడాల్సిన అవసరం ఏముందన్నారు. ఈ నియామకాల్లో రాజకీయ కోణాలు స్పష్టంగా ఉన్నాయనీ, కొత్త ప్రభుత్వం వచ్చే వరకూ ఆగాలంటూ విజయసాయి రాసిన లేఖలో పేర్కొన్నారు.
విచిత్రం ఏంటంటే, ఆర్టీఐ కమిషనర్ల ప్రతిపాదనకు సంబంధించిన వివరాలు విజయసాయికి ఎలా తెలుస్తాయి? ప్రభుత్వం ప్రతిపాదించిన ఇద్దరిలో ఒకరిని గవర్నర్ ఓకే చేశారనీ ఎలా తెలుస్తుంది? ప్రతిపాదన స్థాయిలో ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయాలు ఆయనకు మాత్రమే తెలుస్తుంటాయి, అదేంటో? ఇంకోటి, ఆర్టీఐ కమిషనర్ల నియామకం ఎలా చెయ్యాలనేది ఈయన చెప్పాల్సిన అవసరం ఏముంది? దానికి సంబంధించిన మార్గదర్శకాలున్నాయి. వాటి అనుగుణంగానే గవర్నర్ స్పందిస్తారు. కొత్త ప్రభుత్వం వచ్చే వరకూ ఈ నియామక ప్రక్రియ ఆపాలంటూ విజయసాయి కోరడం విడ్డూరం! ప్రభుత్వ నిర్ణయాలను ఆపాలీ వాయిదాలు వేసుకోవాలని చెప్పడానికి ఈయన ఎవరనేది ప్రశ్న? ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తరువాత లోపభూయిష్టం అనిపిస్తే… ప్రశ్నించడంతో తప్పులేదు. కానీ, ప్రతిపాదన స్థాయిలో ఈయన లేఖలు రాసేయడం విచిత్రంగా ఉంది.